స్టేషన్ ఘన్ పూర్ టిక్కెట్టు దక్కకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్: టిక్కెట్టు దక్కకపోవడంతో స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంబేద్కర్ విగ్రహం ముందు పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్టేషన్ ఘన్ పూర్ నుండి రాజయ్య స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు.
సీఎం కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ స్టేషన్ ఘన్ పూర్ నుండి టీడీపీ అభ్యర్ధిగా కడియం శ్రీహారి ప్రాతినిథ్యం వహించారు. గతంలో వీరిద్దరూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2009 ఎన్నికల తర్వాత కొంత కాలానికే రాజయ్య బీఆర్ఎస్ లో చేరారు. 2014, 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి రాజయ్యకు కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చారు.
2014లో కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్యకు డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. అయితే కొన్ని కారణాలతో రాజయ్యను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత అదే స్థానంలో కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా తీసుకున్నారు. అయితే 2018లో స్టేషన్ ఘన్ పూర్ నుండి పోటీకి కడియం శ్రీహరి ప్రయత్నించారు. కానీ కేసీఆర్ టిక్కెట్టు ఇవ్వలేదు. కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవిని పొడిగించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి కేసీఆర్ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు.
రాజయ్యపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఈ దఫా పోటీ చేసేందుకు అవకాశం కల్పించలేదని పార్టీ వర్గీయుల్లో ప్రచారంలో ఉంది. నెల రోజుల క్రితం కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలపై కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం కూడ స్పందించింది. మంత్రి కేటీఆర్ రాజయ్యను పిలిపించి మాట్లాడారు. కడియం శ్రీహరితో వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్టుగా రాజయ్య చెప్పారు. అయితే ఘన్ పూర్ టిక్కెట్టు దక్కకపోవడంతో రాజయ్య తీవ్రంగా నిరాశ చెందారు.