Dalit: సాయన్న నోచుకోలేదు.. లాస్య నందితకు దక్కుతున్న గౌరవం

By Mahesh K  |  First Published Feb 23, 2024, 5:06 PM IST

సాయన్న గతేడాది ఫిబ్రవరి 19వ తేదీన కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. ఆయన భౌతిక దేహానికి అధికారికంగా అంతిమ సంస్కరాలు నిర్వహించకపోవడంపై అప్పుడు దుమారం రేగింది. ఆయన అభిమానులు సొంతపార్టీపైనే పోరాడారు. ఆందోళన చేశారు. సాయన్న భౌతిక దేహానికి సాదాసీదాగా అంత్యక్రియలు నిర్వహించడం దళితులపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న వివక్షే అని ఆరోపణలు వచ్చాయి. కానీ, లాస్య నందిత భౌతిక దేహానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
 


Lasya Nandita: జీ సాయన్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దళిత నాయకుడిగా పేరు సంపాదించారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరి.. గులాబీ పార్టీలోనే గతేడాది ఫిబ్రవరి(ఫిబ్రవరి 19వ తేదీ)లో మరణించారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన హాస్పిటల్‌లో మరణించారు. అప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు అందరూ సంతాపం తెలిపారు. ఆయన అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ శాసన సభ్యుడు జీ సాయన్న మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించరా? అని సొంత పార్టీపైనే అభిమానులు ఆందోళన చేశారు. అక్కడికి వచ్చిన మంత్రులను నిలదీశారు. అంత్యక్రియలు కొద్ది సేపటి ముందే మారేడ్‌పల్లి స్మశాన వాటిలో వారు తీవ్రంగా వాదించారు. అప్పటి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలను నిలదీయడంతో.. వారు అందుకు సరేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ, తమ నాయకుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోవడం లేదని కొద్ది సమయంలోనే తెలిసింది. 

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందని, అప్పటికప్పుడే అలా చేయలేమని పోలీసులు సాయన్న కుటుంబానికి చెప్పారు. తమకు కలెక్టర్ నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు రాలేవని, ఒక వేళ ఇప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలంటే చాలా ఆలస్యం అవుతుందని వివరించారు. దీంతో సాయన్న కుటుంబ సభ్యులు సాయన్న అభిమానులకు సర్దిచెప్పారు. సాదాసీదాగా అంత్యక్రియలు ముగించారు. అధికారిక లాంఛనాల కోసం ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోలేదని అప్పుడు భావించారు.

Latest Videos

Also Read: Lok Sabha Elections: మార్చి 13 తర్వాత ఎన్నికల షెడ్యూల్!.. ఈసీ వర్గాల వెల్లడి

ఈ పరిణామంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దళిత కార్యకర్తలు కూడా ఆగ్రహించారు. సినీ నటులకు, ఏపీకి చెందినవారు ఇక్కడ మరణించినా.. వారికి అధికారిక లాంఛనాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు చేపట్టిందని, కానీ, సాయన్న భౌతిక దేహానికి ఎందుకు అలా చేయలేదని నిలదీశారు. ఇది కేవలం దళితుల పట్ల వివక్షేననే ఆరోపణలనూ తీవ్రంగా చేశారు.

కానీ, దురదృష్టవశాత్తు.. ఏడాది తిరిగేలోపే సాయన్న బిడ్డ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించింది. సాయన్న రాజకీయ వారసురాలిగా అసెంబ్లీ బరిలోకి దిగి విజయం సాధించిన యువ నేత ఈ రోజు తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో స్పాట్‌లోనే మరణించింది. అన్ని పార్టీల నాయకులు లాస్య నందిత మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

Also Read: YS Sharmila: అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల.. తన తండ్రి, తల్లిని పేర్కొంటూ కామెంట్స్

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం లాస్య నందిత మరణంపై సకాలంలోనే స్పందించింది. ఆమె భౌతిక దేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చీఫ్ సెక్రెటరీకి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయంపై సాయన్న అభిమానులు కొంత ఉపశమనం పొందారు. ఇది రాజకీయంగానూ కాంగ్రెస్‌కు కలిసి వచ్చే నిర్ణయమే కావొచ్చు.. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినందుకు ఈ ప్రకటన రావడంపై రాజకీయ విశ్లేషకులు కూడా సానుకూలంగానే స్పందించారు.

click me!