వాళ్లది ప్రేమ పెళ్లి కాదా..? బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడా..?

By ramya neerukondaFirst Published 22, Sep 2018, 10:42 AM IST
Highlights

భార్య శ్రీహర్షను ఆమె పుట్టింటివారు తీసుకెళ్లారనే మనస్తాపంతో తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు.. తన చావుకు భార్య, ఆమె కుటుంబసభ్యులే కారణమని ఆరోపిస్తూ శ్రీకాంత్‌ ఆ రోజు సాయంత్రం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. 

తన భార్యను తన నుంచి దూరం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇటీవల శ్రీకాంత్ అనే  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా.. అతని ఆత్మహత్య వెనుక కారణాలు తాజాగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు అతనిది ప్రేమ పెళ్లి కాదని.. బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ సంతో‌షనగర్‌కు చెందిన శ్రీకాంత్‌ (25) బుధవారం నడిరోడ్డు మీద ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. భార్య శ్రీహర్షను ఆమె పుట్టింటివారు తీసుకెళ్లారనే మనస్తాపంతో తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు.. తన చావుకు భార్య, ఆమె కుటుంబసభ్యులే కారణమని ఆరోపిస్తూ శ్రీకాంత్‌ ఆ రోజు సాయంత్రం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. 

కాగా శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్న రోజే శ్రీహర్ష అతడిపై పాలమూరులో పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాంత్‌ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీహర్ష పోలీసులకు ఫిర్యాదులోని అంశాలు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నల్లగొండకు జిల్లా నకిరేకల్‌కు చెందిన శ్రీహర్షకు, శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. 

ఈ పరిచయం ఆసరాగా చేసుకొని ఆమెను శ్రీకాంత్‌ తన సోదరి ఫంక్షన్‌కు ఆహ్వానించాడు. అక్కడ ఆమెకు తెలియకుండా కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపాడు. స్పృహ కోల్పోగానే అభ్యంతరకర స్థితిలో ఆమెను ఫొటోలు తీశాడు. వాటితో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో శ్రీహర్ష ఏడాది క్రితం నల్లగొండ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత పాలమూరు మెడికల్‌ కళాశాలలో సీటు రావడంతో ఇక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది.

భార్యను కలిసేందుకు శ్రీకాంత్‌ తరచూ కళాశాలకు వచ్చేవాడు. ఈ క్రమంలో భార్య స్నేహితురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆమెకు అతడు వాట్సప్‌ ద్వారా మెసేజ్‌లు పంపేవాడు. ఆమె ఇచ్చిన చనువును ఆసరాగా చేసుకొని.. బాత్‌రూం ఫొటోలు పంపమంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో రూ.2.5 లక్షలు ఇవ్వాలని. లేదంటే మెసేజ్‌లన్నీ బయటపెడతానని హెచ్చరించాడు. 

దీంతో గత ఏడాది ఆగస్టులో బాధితురాలు రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేయగా శ్రీకాంత్‌పై కేసు నమోదు చేశారు. అప్పటికే భర్త వేధింపులతో విసిగిపోయిన శ్రీహర్ష.. తన స్నేహితురాలిని కూడా వేధింపులకు గురిచేస్తున్నాడనే విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైంది. శ్రీకాంత్‌పై నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వరకట్న వేధింపులకేసును పెట్టడంతో పాటు నల్లగొండ కోర్టులో విడాకులకూ దరఖాస్తు చేసుకుంది. 

ఈ క్రమంలోనే శ్రీకాంత్‌ తనపై పగ పెంచుకొని.. తన ఫొటోలను అభ్యంతరకర రీతిలో మార్ఫింగ్‌ చేసి కాలేజీ గోడలకు అతికించాడని.. ఆ ఫొటోలను తన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపడంతో పాటు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని ఆమె 19న మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదేరోజు అర్ధరాత్రి శ్రీకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

read more news

ప్రేమ పెళ్లి.. భార్యని దూరం చేశారని .. ఆత్మహత్య

Last Updated 22, Sep 2018, 10:42 AM IST