హైదరాబాద్ లో ని నార్సింగిలో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఒకరు క్లాస్ రూంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నార్సింగిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీచైతన్య కాలేజీలోని క్లాస్ రూంలో సాత్విక్ అనే విద్యార్థి బలవన్మరణానికి పూనుకున్నాడు. కాలేజీలో వేధింపుల వల్ల మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాత్విక్ ను కాలేజీలో కొట్టేవారని, దానితో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడని అంటున్నారు.
మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకున్న సాత్విక్ ను ఆస్పత్రికి తరలించడానికి కూడా యాజమాన్యం ముందుకు రాలేదని, తామే బయట వరకు మోసుకుని వచ్చి బైకర్ ను లిఫ్ట్ అడిగి అస్పత్రికి తరలించామని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థులను అక్కడి నుంచి ఖాళీ చేయించి మరో హాస్టల్ కు తరలిస్తున్నారు.