తెలంగాణలో కరోనా వైరస్ వ్యాధి మరో జర్నలిస్టును మింగేసింది. సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం కరోనా వైరస్ కు చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మరో జర్నలిస్టును బలి తీసుకుంది. సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ ధర్మాసనం కరోనా వైరస్ తో బుధవారం ఉదయం కన్నుమూశారు. పది రోజుల క్రితం కరోనా వ్యాధితో ఆయన ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు.
శ్రీధర్ ధర్మాసనం కరీంనగర్ జిల్లాకు చెందినవారు. శ్రీధర్ 1965 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. అయితే, చాలా ఏళ్ల క్రితమే హైదరాబాదులో స్థిరపడ్డారు విద్యాభ్యాసం హైదరాబాదులో జరిగింది. జగ్జీవన్ రామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం పట్టా పుచ్చుకున్నారు.
undefined
Also Read: కరోనాతో మరణించిన జర్నలిస్టులు వీరే: ప్రభుత్వాల వివక్ష, ప్రెస్ క్లబ్ వినతి
న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్ (విజయవాడ), లో పని చేస్తూ టెలిమెడియా అనే టీవీ మీడియా సంస్థని 1992 ప్రాంతాల్లో స్థాపించాడు. వరల్డ్ వైడ్ టెలివిషన్ నెట్వర్క్ (WTN) కి వివిధ కార్యక్రమాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్మించాడు.
మేనకా గాంధీ నిర్మించిన పలు టీవీ కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ నుండి కార్యక్రమాలని నిర్మించాడు. జైన్ టీవీ, టీవీ టేక్స్ వంటి సంస్థలలో పనిచేశాడు, ప్రస్తుతం మాహైద్రాబాద్.ఇన్ అనే వెబ్ సైట్ ఎడిటర్ గా వున్నారు. తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.
తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు కూడా రాశారు. డిజిటల్ మీడియాకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపును సాధించడానికి విశేషమైన కృషి చేశారు. ఆన్ లైన్ జర్నలిస్టులకు ఓ యూనియన్ ను ఏర్పాటు చేశారు శ్రీదర్ ధర్మాసనం మృతికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తవ్ర విచారం వ్యక్తం చేశారు. టిమ్స్ వైద్యులతో తాను మాట్లాడానని, అయినా శ్రీధర్ ను దక్కించుకోలేకపోయామని ఆయన అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీలో ఆన్ లైన్ జర్నలిస్టుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ధర్మాసనంతో కలిసి పాల్గొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
శ్రీధర్ ధర్మాసనం మృతికి సీనియర్ జర్నలిస్టు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ఫోరమ్ తో కలిసి ప్రయాణం చేసిన వాడని ఆయన గుర్తు చేసుకున్నారు.. మన పోరాటం ఇంకా మిగిలే ఉందని వాదించే శ్రీధర్ అన్న మరణం తీవ్రంగా కలచివేసిందని క్రాంతి అన్నారు. శ్రీధర్ మరణం తెలంగాణ జర్నలిస్ట్ లకె కాదు తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు అని ఆయన అన్నారు. తెలంగాణ ఎలా ఉండాలో కలలు కన్న వ్యక్తి మధ్యలో నే అందరిని విడిచి పోవడం బాధాకరమని అన్నారు. శ్రీధర్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 15 మందికి పైగా జర్నలిస్టులు కోరనాతో మృత్యువాత పడ్డారు.