సంక్రాంతి తర్వాత తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?.. వారికి చోటు కల్పించనున్న కేసీఆర్..!

By Sumanth KanukulaFirst Published Dec 25, 2022, 10:04 AM IST
Highlights

భారత రాష్ట్ర సమితి‌తో(బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

భారత రాష్ట్ర సమితి‌తో(బీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో.. ఇప్పటి నుంచే గులాబీ పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి తర్వాత గానీ, ఫిబ్రవరి మొదటివారంలో గానీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే చిన్నపాటి మార్పులు మాత్రమే ఉంటాయని సమాచారం. 

ప్రస్తుతం హరీష్ రావు ఆర్థిక శాఖ‌తో పాటు.. ఈటల రాజేందర్ ఉద్వాసన తర్వాత ఖాళీ అయిన వైద్యారోగ్య శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. రెండు కీలక శాఖలను నిర్వహించడం ఒక్కరే నిర్వహించడం భారమనే చెప్పాలి. అలాగే ప్రస్తుతం మంత్రి వర్గంలో ఇద్దరు, ముగ్గురు పనితీరుపై కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతుంది. వారిని కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఇద్దరు మంత్రులను, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఒక మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. వారి పనితీరుపై సీఎం కేసీఆర్ అంసతృప్తిగా ఉండటమే ఇందుకు కారణంగా  కనిపిస్తోంది.  ఈ పక్షంలో కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి  మంత్రివర్గంలో బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ చేపడితే.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి‌‌తో మరో ఒకరిద్దరు నేతల పేర్లను కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును బహిర్గతం చేసిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. 

అయితే కేసీఆర్ మంచి ముహుర్తాల కోసం చూస్తున్నారని.. సంక్రాంతి తర్వాత శుభదినాలు ఉండటంతో కొత్త సచివాలయ ప్రారంభం, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా గులాబీ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడితే అది జనవరి మూడో వారంలో గానీ, ఫిబ్రవరి ప్రారంభంలో గానీ జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

click me!