
తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రవేశంపై వాతావరణశాఖ అంచనాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ నెల 8వ తేదీలోపే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఎట్టకేలకు నేడు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మహబూబ్‌నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలకు, తర్వాతి 2 రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నైరుతి రుతుపవనాలు ఎంట్రీతో.. వేడి, ఉక్కపోతతో సతమతవుతున్న ప్రజలకు ఉపశమనం కలగనుంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.
ఇక, ఈ ఏడాది సాధారణం కంటే మూడు రోజుల ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దీంతో తెలంగాణలో కూడా ముందుగానే రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని భావించారు. అయితే రుతపవనాల రాక ఆలస్యం కావడంతో.. ఉష్ఱోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఇదిలా ఉంటే గత రాత్రి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.