
కరీంనగర్: కేవలం తెలంగాణ ప్రజలే కాదు యావత్ దేశ ప్రజానీకం కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని రాష్ట్ర బీసీ, పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) అన్నారు. బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేకే ఇంతకాలం దేశప్రజలు భరించాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని... బీజేపీకి ప్రత్యామ్నాయం ఆయన వల్లే సాధ్యమని భావిస్తున్నారని మంత్రి గంగుల పేర్కొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ లో 35 లక్షలతో చేపట్టనున్న మార్కెట్ ఆధునీకరణ పనులకు మంత్రి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ చేస్తున్న జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న 50 పథకాలు దేశంలో ఎక్కడా లేవని... రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడంతో దిగుబడి పెరిగిందన్నారు. తాగు, సాగు నీటి సమస్య పూర్తిగా తీరిందన్నారు. ఇదంతా ఇతర రాష్ట్రాల ప్రజలందరూ చూస్తున్నారు... కాబట్టి వారంతా ఇలాంటి ఫలాలు తమకు అందాలనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని మంత్రి గంగుల తెలిపారు.
Video
''దేశ ప్రజలు 80 ఏళ్ళ పాలన ఎలా వుందో చూసారు. అదే ప్రజలు ఈ ఎనిమిదేళ్ళలో తెలంగాణ పాలన చూసారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి తమ వద్ద కూడా కావాలని కోరుకుంటున్నారు. ఆనాడు ఎన్టీఆర్ కు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీపెట్టిన 13 నెలల్లోనే అధికారం ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రజలు కేసీఆర్ పాలనను చూస్తున్నారు. అది నచ్చడంవల్లే దేశంలోనూ ఈ పాలన వుండాలని కోరుకుంటున్నారు'' అని మంత్రి గంగుల అన్నారు.
''ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం, బిజెపి పాలిత గుజరాత్ లో మహిళలు నీటికోసం, రైతులు సాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రజలు ఏదయితే కోరుకుంటారో కేసీఆర్ అదే చేస్తాడు... దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే'' అని గంగుల తెలిపారు.
''నేను కేసీఆర్ అభిమానిని. ఆయన ఆదేశాలను శిరసా వహిస్తాను. ఆయన ఏది చెప్తే అదే చేస్తా. ఎమ్మెల్యే, ఎంపీ దేనికి పోటీచేయమన్నా చేస్తా. ఆయన మాట నాకు శిరోధార్యం. ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే నేనుంటా'' అని మంత్రి స్పష్టం చేసారు.
ఇక తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి గంగుల పేర్కొన్నారు. పల్లెలన్నీ పట్టణాలుగా మారాలని... పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా మెరవాలి... ప్రజలు మురవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని అన్నారు. గతంలో మహిళలు ప్రయాణాల్లో, నగరాల్లో టాయిలెట్స్ కోసం బయటికెళ్లాలంటే ఇబ్బందులు పడేవాళ్ళని... ఆ సమస్యలను అధిగమించాలని 23 టాయిలెట్స్ పట్టణ ప్రగతిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం... అందులో వారికి కావాల్సిన అన్ని సమకూరుస్తామన్నారు.టాయిలెట్ల ఏర్పాటు పై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.