Asianet News TeluguAsianet News Telugu

Hyderabad Crime Report: విస్తుగొలిపే నిజాలు.. సైబర్ నేరాల్లో హైదరాబాద్ టాప్..

Hyderabad Crime Report 2023: హైదరాబాద్ (Hyderabad)లో నేరాలు పెరిగినట్లు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే.. 2023లో నేరాలు గణనీయంగా పెరిగాయని పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను నూతన సీపీ కొత్త శ్రీనివాసరెడ్డి (Kothakota Srinivas Reddy)విడుదల చేశారు. ఈ గణాంకాలు పరిశీలిస్తే..2023లో పలు నేరాలు పెరిగాయని వెల్లడించారు.  

Kothakota Srinivas Reddy says Crime rate up two percent in 2023 in Hyderabad Commissionerate KRJ
Author
First Published Dec 23, 2023, 4:36 AM IST

Hyderabad Crime Report 2023: తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో నేరాలు పెరిగినట్లు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి. 2021, 2022 సంవత్సరాలతో పోలిస్తే.. 2023లో నేరాలు గణనీయంగా పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను నూతన సీపీ కొత్త శ్రీనివాసరెడ్డి (Kothakota Srinivas Reddy)విడుదల చేశారు. ఈ గణాంకాలు పరిశీలిస్తే.. 2023లో నగరంలో నమోదైన సైబర్ క్రైమ్‌లలో పెట్టుబడి మోసం కేసులు గణనీయంగా పెరిగాయి. 

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 1,271 పెట్టుబడి మోసం కేసులు నమోదయ్యాయి, బాధితులు మోసగాళ్లకు రూ. 84.44 కోట్లు కోల్పోయారు. అలాగే..ట్రేడింగ్ మోసం కేసులు 2022లో 13 నుండి ఈ ఏడాది 34కి పెరిగాయి. బాధితులు సుమారు రూ  8.47 కోట్లు కోల్పోయారు. కస్టమ్స్ ఫ్రాడ్ కేసులో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది దాదాపు 40 కేసులు నమోదయ్యాయి. ఇందులో బాధితులు రూ. 2.65 కోట్లు కోల్పోయారు. కస్టమర్ కేర్ మోసంలో 160 కేసులు నమోదయ్యాయి. ఈ  కేసుల్లో బాధితులు రూ.3.61 కోట్లులు కోల్పోయారని  శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 
 
సైబర్ క్రైమ్ బృందాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను గుర్తించి, నేరస్తులను గుర్తించి, వారిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె శ్రీనివాస రెడ్డి తెలిపారు . 2023 లో సైబర్ మోసాలకు పాల్పడిన 169 మందిని పోలీసులు అరెస్టు చేశారు . 2023లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 2,735 కేసులు నమోదు కాగా , స్థానిక పోలీస్ స్టేషన్లలో మరో 1,597 కేసులు నమోదయ్యాయి. సైబర్ సేఫ్టీపై పోలీసులు వివిధ మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారని , ప్రజలకు చేరువ అవుతున్నారని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. .

పెరిగిన బ్లాక్ మెయిల్, ఫోన్ వేధింపుల కేసులు 

హైదరాబాద్ నగర పోలీసుల 'భరోసా సెంటర్'లో నమోదైన నేరాల్లో బ్లాక్ మెయిల్ చేయడం, ఫోన్ వేధింపులు, పెళ్లి సాకుతో మోసం చేయడం అగ్రస్థానంలో ఉంది . బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించి 212, ఫోన్‌లో వేధింపులకు సంబంధించి 185, వేధింపులకు సంబంధించి 106, పెళ్లిళ్లను సాకుగా చూపి మోసాలకు పాల్పడటం 107 అర్జీలను అధికారులు స్వీకరించారు.

పెరిగిన సిగ్నల్ జంపింగ్ కేసులు 

సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలలో నగరం అగ్రస్థానంలో ఉంది. ట్రాఫిక్ పోలీసులు తమ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా 2023లో నగరంలో వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 47,25,089 కేసులను బుక్ చేసినట్టు తెలిపింది. ఈ ఉల్లంఘనలపై రూ. 71.69 కోట్ల జరిమానా విధించారు. ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 280 మంది మరణించగా, మరో 2,090 మంది గాయపడ్డారు.ఈ రోడ్డు ప్రమాదాలలో మొత్తం 121 మంది పాదచారులు, యాచకులు 23 మంది, 18 మంది జైవాకర్లు మరణించారు. 2022లో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 275 మంది చనిపోయారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మహిళలపై పెరిగిన నేరాలు

2022తో పోలిస్తే..2023లో 2 శాతం నేరాలు పెరిగాయి. స్థిరాస్తి నేరాలు కూడా అధికంగా నమోదయ్యాయి. ఈ ఏడాది హత్యలు తగ్గి, స్థిరాస్తి సంబంధిత నేరాలు 3 శాతం  పెరిగినట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళలపై నేరాలు 12 శాతం పెరిగాయి. మహిళలపై 2022లో 343 అత్యాచార కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది వాటి సంఖ్య 403కు చేరిందని అన్నారు. అలాగే.. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు పెరిగడంతో.. వాటిని అంతేవేగంతో పరిష్కరిస్తున్నట్టు వెల్లడిస్తున్నట్టు తెలిపారు.  ఈ ఏడాది 9 శాతం దోపిడీలు పెరిగితే, పోక్సో కేసులు 12 శాతం తగ్గాయి. ఈఅ ఏడాది 79 హత్యలు, 403 రేప్‌ కేసులు, 242 కిడ్నాప్‌లు, 4,909 చీటింగ్‌ కేసులు నమోదైనట్టు తెలిపారు.  ఏడాది కాలంలో 63 శాతం నేరస్థులకు శిక్షలు పడితే...అందులో 13 మందికి జీవిత ఖైదు పడిందనీ,  వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లుగా నమోదైందని తెలిపారు.
 
డ్రగ్స్ సరఫరా ముఠాలకు హెచ్చరిక


అదే సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్‌ సరఫరా ముఠాలకు హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ సరఫరా కార్యకలాపాలకు పాల్పడితే..ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. పబ్స్‌, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌ యజమానులు కూడా డ్రగ్స్ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ ను ప్రోత్సహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ మూలాలుంటే సహించేది లేదని, ఈ విషయంపై సినీ రంగానికి చెందిన పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్‌.. ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. 

నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకలను అర్ధరాత్రి ఒంటి గంట లోపు ముగించాలని సూచించారు. నిబంధనలను అధిగమిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్‌ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios