హైద్రాబాద్‌లో అమానుషం: తల్లిని రోడ్డుపైనే కొట్టిన కొడుకు

By narsimha lodeFirst Published Jul 5, 2020, 10:14 AM IST
Highlights

70 ఏళ్ల వయస్సున్న తల్లిని ఓ కొడుకు నడిరోడ్డుపై కొట్టాడు. అక్కడే ఆమెను వదిలి వెళ్లిపోయాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఎస్ఆర్ నగర్ లోని రామకృష్ణ రెసిడెన్సీ వద్ద శనివారం నాడు చోటు చేసుకొంది.


హైదరాబాద్:70 ఏళ్ల వయస్సున్న తల్లిని ఓ కొడుకు నడిరోడ్డుపై కొట్టాడు. అక్కడే ఆమెను వదిలి వెళ్లిపోయాడు.ఈ ఘటన హైద్రాబాద్ ఎస్ఆర్ నగర్ లోని రామకృష్ణ రెసిడెన్సీ వద్ద శనివారం నాడు చోటు చేసుకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన  70 ఏళ్ల అరుణకు ముగ్గురు కొడుకులు. భర్త వరంగల్ లో, ఇద్దరు కొడుకులు స్వంత ఊరిలో ఉంటున్నారు. చిన్న కొడుకు వేణు బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుకనే ఉన్న బ్రహ్మణ వీధిలో నివాసం ఉంటున్నాడు. వేణు వద్దే అరుణ ఉంటుంది.

అరుణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా వృద్దాప్య పెన్షన్ ఇస్తోంది. ఆ డబ్బులు డ్రా చేసుకొనేందుకు అరుణను వేణు బైక్ పై ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్దకు తీసుకొచ్చాడు. 

ఈ సమయంలో తల్లీ కొడుకు మధ్య ఏం జరిగిందో తెలియదు.... తల్లిని తన బైక్ పై నుండి దించి  ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కిందపడింది. కుడిచేతికి, తలకు గాయాలయ్యాయి.  తనను కొట్టవద్దని తల్లి కొడుకును వేడుకొంది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారిని కూడ వేణు తిట్టాడు. అంతేకాదు ఒకరిపై దాడికి ప్రయత్నించాడు. 

దీంతో స్థానికులు వేణుపై దాడికి ప్రయత్నిస్తే బైక్ ను అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు.స్థానికులు ఆ వృద్ధురాలికి భోజనం పెట్టారు. డబ్బుల కోసమే తనను కొడుకు, కోడలు ఇబ్బంది పెడుతున్నారని ఆమె స్థానికులకు వివరించారు. 

ఎస్ఆర్ నగర్ పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి వేణు ఇంటి వద్ద పోలీసులు ఆమెను వదిలి వచ్చారు.

click me!