
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిమిట్ట వద్ద వేగంగా వెళుతున్న లారీ-ఆటో ఎదెరెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి వుంది.
ఒకే కుటుంబానికి చెందిన వారు ఓ శుభకార్యానికి ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదానికి గురయినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆటో నుజ్జునుజ్జు అవడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మర్రిమిట్ట రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందిన ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. వెంటనే తగిన విధంగా సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. క్షతగాత్రులకు సమీప పెద్ద దవాఖానకు తీసుకెళ్లి, మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.