ఈ రోజు కొత్తగా ఆరు కేసులే, ర్యాపిడ్ టెస్టులు చేయం: ఈటెల రాజేందర్

By telugu team  |  First Published Apr 28, 2020, 6:40 PM IST

తెలంగాణలో తాజాగా ఈ రోజు 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. తాము ర్యాపిడ్ టెస్టులు చేయబోమని ఆయన స్పష్టం చేశారు.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఈ రోజు ఆరు కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1009కి చేరుకుంది. కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు మంత్రి తెలిపారు. చికిత్స పొంది 42 మంది కోలుకుని ఈ రోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారని ఆయన చెప్పారు. 

మొత్తం 374 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు, 610 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25  మంది మరణించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు. అందరి కన్నా ముందే మనం లాక్ డౌన్ ను అమలు చేయడం వల్ల కరోనాను కట్టడి చేయగలిగామని చెప్పారు. 

Latest Videos

undefined

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే, రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. కరోనా కట్టడికి రాష్ట్రం తీసుకున్న చర్యలను కేంద్రం కూడా ప్రశంసిస్తోందని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వం ముందుందని అన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో సింగిల్ డిజిట్ లోనే కేసులు నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. 

ఎక్కడ కూడా తాము ర్యాపిడ్ టెస్టులు చేయబోమని స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్స్ కు అనుమతిస్తే పెద్ద యెత్తున క్యూ కడుతారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పరీక్షలు చేయడాన్ని అనుమతించబోమని ఆయన చెప్పారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో 50 శాతం జిహెచ్ఎంసి పరిధిలోనివేనని ఆయన అన్నారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తామని చెప్పారు. 

ర్యాపిడ్ టెస్టులు ఎంత వేదన కలిగించాయో కేంద్ర ప్రభుత్వమే గుర్తించిందని ఆయన అన్నారు. సింప్టమ్స్ ఉన్నవారిని మాత్రమే టెస్టు చేయాలని మార్గదర్శకాలు ఇచ్చిందని, అందుకు అనుగుణంగానే టెస్టులు చేస్తున్నామని, తక్కువ టెస్టులు చేస్తున్నామనే వాదన సరి కాదని ఆయన అన్నారు.  

click me!