కేసీఆర్ గారూ... ఆర్నెళ్లలో కాంగ్రెస్ సర్కార్ కూలుతుందంటగా..: విజయశాంతి 

By Arun Kumar P  |  First Published Dec 13, 2023, 11:09 AM IST

హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు మానవత్వంలో పరామర్శిస్తుంటే దీన్ని కూడా బిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేసారు. 


హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వింత పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారాన్ని కోల్పోవడాన్ని బిఆర్ఎస్ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చివరకు బిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హాస్పిటల్లో వుంటే ముఖ్యమంత్రి, మంత్రులు పరామర్శించడంపైనా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ నాయకుల తీరుపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.  

బిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కు ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో వుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ధైర్యం చెప్పారని... ఆయన కుటుంబాన్ని ఓదార్చారని విజయశాంతి అన్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కేవలం మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తున్నారని అన్నారు. కానీ కొందరు బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు పరామర్శించడాన్ని వ్యతిరేకిస్తూ  కామెంట్స్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సరికాదని బిఆర్ఎస్ నాయకులకు సూచించారు విజయశాంతి. 

Latest Videos

మానవత్వంతో స్పందించినా దాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం ఇప్పుడు బిఆర్ఎస్ కు అవసరమేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. పరామర్శకు వచ్చిన కాంగ్రెస్ నాయకులపై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం కేసీఆర్ పై వుందన్నారు. ఇలా బిఆర్ఎస్ నాయకులను కంట్రోల్ చేయాలంటూ కేసీఆర్ కు సూచించారు విజయశాంతి. 

Also Read  రాజాసింగ్ ఏమైనా జ్యోతిష్కుడా?.. పొన్నం ప్రభాకర్

ఇక ప్రజల మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా అధికారంలో వుండదంటూ బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపైనా విజయశాంతి స్పందించారు. తెలంగాణ అంటేనే బిఆర్ఎస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని... రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పదికాలాలు పదిలంగా వుండాలంటే ఆ దోరణిని విడిచిపెట్టాలని సూచించారు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ కామెంట్స్ చేస్తున్న బిఆర్ఎస్ నాయకులకు ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ ది. మళ్లీ బిఆర్ఎస్ నాయకులెవ్వరూ ఇలాంటి ప్రకటనలు చేయకుండా చూడాలని కేసీఆర్ కు సూచించారు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. 
 

click me!