
1. మొత్తం ప్రభుత్వంలో , ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న పూర్తి ఖాళీలను తక్షణం ప్రకటించండి:
మాకు (టిజాక్) ఉన్న సమాచారం మేరకు, రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు లక్షా ఏడువేలు. తదనంతరం రెటైర్మెంట్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీలు సుమారు 30000. ఆంధ్ర ఉద్యోగులు వారి రాష్ట్రాలకు వెళ్లడంతో ఏర్పడ్డ ఖాళీలు సుమారు 30,000. ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలు సుమారు 50000. కొత్త జూల్లాల ఏర్పాటుతో అవసరమైన పోస్టులు సుమారు 5000, విద్యుత్ సంస్థల పెరుగుతున్న అవసరాల కోసం ప్రతిపాదించిన కొత్త పోస్టులు సుమారు 15000, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న అనేక కొత్త కార్పొరేషన్ల అవసరాలకు సుమారు 5000పోస్టులు, అన్నీ కలిపి కొత్తగా అవసరమైన అదనపు పోస్టులు మొత్తం సుమారు 25000. అంటే ప్రభుత్వ , ప్రభుత్వ రంగ సంస్థల్లో మొత్తం భర్తీ చేయాల్సిన ఖాళీలు సుమారు 2,00,000 నుండి 2,50,000.
2. ఉద్యోగాల భర్తీ కోసం ఒక క్యాలెండర్ ను ప్రకటించండి: మొత్తం ఖాళీలు ఒకేసారి భర్తీ చేయాలని జెయెసీ డిమాండు చేయడం లేదు. అది సాధ్యం కాదు కూడా. కానీ యేటా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు ఒక క్యాలెండర్ ను ప్రకటిస్తే నిరుద్యోగులకు ప్రణాళికా బద్దంగా పరీక్షలకు తయారు కావడానికి సులువవుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ప్రస్తుతం ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలియక నిరుద్యోగులు పడే అవస్థ వర్ణనా తీతం. అనేక మంది నోటిఫికేషన్లు వస్తాయని ఇతర ఉద్యోగాలు వదులు కొని, నోటిఫికేషన్లు రాక, పరీక్ష జరిగినా ఫలితాలు రాక రోడ్ల మీద తిరుగుతున్నారు. క్యాలెండర్ను ప్రకటించడం అసాధ్యమైన విశయం కాదు.
3. భూమి పుత్రులకు రిజర్వేషన్లు:
కొత్త పరిశ్రమలు వస్తున్నాయనీ, లక్షల కొలది ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పడం బాగానే ఉంది. కానీ ఈ ఉద్యోగాలు తెలంగాణ యువతకు రావాలనేదే మేము కోరుకునేది. ప్రస్తుతం కొన్ని కొత్త పరిశ్రమలు వస్తున్నా అందులో తెలంగాణ యువతకు స్థానం దొరకడం లేదు. లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులన్నీ ఇతర రాష్ట్రాల వారికి, ప్రధానంగా సీమాంధ్ర పెట్టుబడి దారులకు వెళ్లడంతో, అందులో పనిచేసే అవకాశం తెలంగాణ యువతకు రావడం లేదు. ఇతర రాష్ట్రాల వారికే ఉద్యోగాలు వస్తున్నాయనడంలో సందేహం లేదు. ప్రైవేటు వ్యక్తులకు అన్నీ వసతులు కల్పించి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించక పోతే ఈ పరిశ్రమల వల్ల ఎవరికి ప్రయోజనం? భూమి పుత్రులకు రిజర్వేషన్లు అనేక రాస్త్రాల్లో ఇప్పటికే అమలవు తున్నాయి. దీనిని తక్షణం అమలు చేయాలి.
4. కాంట్రాక్టు, ఔట్ సోర్స్ కార్మికులకు సమానపనికి సమాన వేతనం కల్పించాలి
ప్రభుత్వంలో పనిచేస్తున్న 20,000 మంది కాంట్రాక్టు కార్మికులను, విద్యుత్ సంస్థలలో పని చేస్తున్న 24000 మంది నాలుగవ తరుగతి కాంట్రాక్టు, ఔట్ సోర్స్ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న 20,000 మందిని రేగులరైజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పటికీ 2 ½ యేండ్లు దాటుతున్నా దానికి మోక్షం కలుగ లేదు. ప్రభుత్వంలో ఈ రెండున్నరేళ్లలో ఒక్క కాంట్రాక్టు ఉద్యోగి రెగ్యులరైజ్ అయిన దాఖలా లేదు. ఇప్పుడు కొత్తగా 24,000 మంది విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెబుతున్నారు. ప్రాణాలకు తెగించి రోజూ పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేయడం మంచి ఆలోచనే. అయితే ఇది ఎప్పటికి పూర్తవుతుందో వూహించడం కష్టం. కానీ, 2016 అక్టోబరులో సుప్రీం కోర్టు ఇచ్చిన “ సమాన పనికి సమాన వేతనం” ఇవ్వాలన్న తీర్పును ఎందుకు పక్కకు పెట్టినట్టు? మీరు ప్రకటించినట్లు కాంట్రాక్టు, ఔట్ సోర్స్ కార్మికులను రెగ్యులరైజ్ చేసేలోపల, తక్షణం వీరికి సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి “ సమాన పనికి సమాన వేతనం” చెల్లించాలి.
5. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను విస్తృత పరచడానికి ప్రణాళిక ప్రకటించాలి:
కేవలం ప్రభుత్వ ఉద్యోగాలతోటే మొత్తం నిరుద్యోగ సమస్య పరిష్కారమవు తుందని తెలంగాణ జెయెసీ భావించడం లేదు. ఇది ఒక ప్రధాన మైన అంశం. అయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృత పరచడానికి ప్రభుత్వం అనుసరించనున్న ప్రణాళికను తక్షణం ప్రజల ముందుంచాలి. తెలంగాణ అభివృద్ది నమూనా బడా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల చుట్టూ కాకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కేంద్రంగా ఉండాలి. ప్రభుత్వం తక్షణం ఈ ప్రణాళికను తయారుచేసి ప్రజల ముందుంచాలి.
6. నిరుద్యోగ భృతి:
పనిచేసే హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది. నిరుద్యోగులు ఎదుర్కోనే సమస్యలు వర్ణనాతీతం. వారికి కనీస తోడ్పాటు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా ఉన్న కనీస బాధ్యత. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు “ నిరుద్యోగ భృతి” ని తక్షణం ప్రకటించి అమలు చేయాలి.
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తెలంగాణ జేయెసీ చేసిన సూచనలు ఆచరణ సాధ్యం. వీటిని ప్రభుత్వం పరిశీలించి అమలు చేయాలి. యువత కన్నీరు పెట్టడం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. వారి త్యాగాల ఫలితంగానే అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి.