మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. రంగంలోకి సిట్, నిందితులను ప్రశ్నించిన సీవీ ఆనంద్

By Siva KodatiFirst Published Nov 11, 2022, 4:21 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో ముగ్గురు నిందితులను విచారించింది సిట్ బృందం. అనంతరం వారిని రాజేంద్రనగర్ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం నియమించిన సిట్ రంగంలోకి దిగింది. హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ .. ముగ్గురు నిందితులను విచారిస్తోంది. వాయిస్ శాంపిల్స్ సేకరణ పూర్తయిన తర్వాత.. వారిని రాజేంద్రనగర్ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు. 

ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసు దర్యాప్తును గురువారం ప్రభుత్వం సిట్ చేతికి అప్పగించింది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్ ఏర్పాటు చేశారు. మరో ఆరుగురు పోలీస్ అధికారులు ఇందులో సభ్యులుగా వుంటారు. వీరిలో నల్గొండ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డిలు వున్నారు. 

ALso REad:మొయినాబాద్ ఫాంహౌస్‌ కేసు .. సిట్‌ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుపై వున్న స్టేను ఎత్తేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పిన కొద్దిగంటల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు ముందుకు వెళ్లొచ్చని న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటి కేసులో ఎక్కువ రోజులు దర్యాప్తును నిలిపివేయడం మంచిది కాదని కోర్టు అభిప్రాయపడింది. 

కాగా... గత నెల 26న మొయినాబాద్ ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు చేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి ,సింహయాజీ, నందకుమార్ లను మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిర్యాదు మేరకు  పోలీసులు ఈ ముగ్గురిని అరెస్ట్  చేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యేరేగా కాంతారావు ,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ఈ ముగ్గురు నిందితులు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపించింది. దీని వెనుక బీజేపీ ఉందని కూడ గులాబీ పార్టీ  తెలిపింది. అయితే ఈ  ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఈ విషయమై ఆడియో, వీడియోలను  కూడ టీఆర్ఎస్ విడుదల చేసింది.

click me!