
హైదరాబాద్: కరోనా వైరస్ కొత్త రూపాల్లో భయాందోళనలు సృష్టిస్తున్నది. ప్రస్తుతం ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న ఆయుధం టీకాలే. కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తున్నా అన్ని దేశాలు టీకాలనే నమ్ముకున్నాయి. మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీలో ఎంతమాత్రం నిర్లక్ష్యం వహించడం లేదు. టీకాలపై ఉన్న భయాందోళనలు తొలగించడానికి అవగాహన కార్యక్రమాలతోపాటు మొబల్ వ్యాక్సినేషన్, అందుబాటులో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాద్‌లో కోఠిలోని విమెన్స్ కాలేజీ(Koti Women College)లో ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని(Vaccination Drive) నిర్వహించారు. రొటారాక్ట్ క్లబ్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజ్ ఫర్ విమెన్, తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా ఒక రోజు ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని కాలేజీలో నిర్వహించారు.
ఈ నెల 15వ తారీఖున కోఠి విమెన్స్ కాలేజీలో ఒక రోజు ఉచిత టీకా పంపిణీ డ్రైవ్ నిర్వహించారు. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ వెంకటేశ్వర్ రావులు ఈ డ్రైవ్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజ్జులత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కవిత, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. గ్యాదరీ బాలమల్లు, వెంకటేశ్వర్ రావులకు వీరంతా కాలేజీ మొత్తం చూపించారు. కాలేజీ టూర్ వేశారు. అనంతరం కాలేజీకి కావాల్సిన మరికొన్ని మౌలిక వసతులను సిబ్బంది వారితో ప్రస్తావించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పరమైన అంశాలను వారి ముందు ఉంచారు. 200 మీటర్ల సింథటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ మల్టీపర్పస్ హాల్‌ల నిర్మాణాల ప్రతిపాదనను పరిశీలిస్తామని కాలేజీ యాజమాన్యానికి అధికారులు హామీ ఇచ్చారు.
Also Read: Telangana Omicron cases : టోలిచౌకి పారామౌంట్ కాలనీలో కంటైన్మెంట్ జోన్
కోఠి విమెన్స్ కాలేజీ నిన్న నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా జరిగింది. ఇందులో విద్యార్థులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, ఇతరులకూ టీకా వేశారు. మొత్తంగా సుమారు 250 మందికి టీకా వేశారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,776 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 186 పాజిటివ్ కేసులు (corona cases) నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ నిన్న రాత్రి ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,78,874కి చేరింది. కోవిడ్ వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి తెలంగాణలో (corona deaths in telangana) కరోనా మృతుల సంఖ్య 4,010కి చేరింది. వైరస్ బారి నుంచి నిన్న 206 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: ఒమిక్రాన్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్:ప్రైమరీ కాంటాక్టులకు వైద్య పరీక్షలు
కాగా, తెలంగాణలో మొత్తం రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి ఒకరు, సొమాలియా నుంచి వచ్చిన మరొకరిలో ఈ వేరియంట్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. వీరిద్దరూ టోలీచౌకీ, మెహెదీపట్నంలో ఉంటున్నట్టుగా గుర్తించారు. అయితే, వీరు ఆయ దేశస్తులే కానీ, మన దేశ వాసులు కాదు. కాగా, తెలంగాణలోనే మరో ఏడేళ్ల పిల్లాడిలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. కానీ, ఆ పిల్లాడు పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయినట్టు తెలిసింది.