
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ , ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలు టికెట్ కోసం పోటెత్తారు. వచ్చి పోయేవారితో గత కొన్నిరోజులుగా గాంధీ భవన్ కళకళలాడుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
ఇదిలావుండగా ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నాడు. హైదరాబాద్‌లోని గోషామహాల్ నుంచి పోటీ చేస్తానని.. తనకు టికెట్ కేటాయించాల్సిందిగా రాహుల్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. దీంతో రాహుల్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. దరఖాస్తుల పరిశీలన తర్వాత ఆయా నియోజకవర్గాలకు టీపీసీసీ అభ్యర్ధుల్ని ఎంపిక చేయనుంది.
ఇక.. రాహుల్ సిప్లిగంజ్ విషయానికి వస్తే తొలుత యూట్యూబర్‌గా లోకల్ సాంగ్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అనంతరం సినిమాల్లో అవకాశాలు రావడంతో తన గాత్రంతో హిట్ సాంగ్స్ పాడి దూసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా సినిమాల్లో రాహుల్ పాడారు. అంతేకాదు.. స్టార్ మాలో ప్రసారమైన రియాలిటీ షో బిగ్‌బాస్ 3 విజేతగానూ నిలిచారు. ఈ ఏడాది రాహుల్‌కు ప్రత్యేకమనే చెప్పాలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘‘నాటు నాటు సాంగ్’’కు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ పాటను పాడిన రాహుల్.. ఆస్కార్ వేదికపై అతిరథ మహారథుల మధ్య పాడారు.
Also Read: నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?
మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు సీనియర్ల నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఆయన రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.
ఇటు మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తిని రేపుతోంది. ఆయన ఇంత వరకు ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోలేదు. అయితే జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్ నుంచి ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే దరఖాస్తు సమర్పించారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి అప్లికేషన్ పెట్టుకున్నారు.