సింగరేణి కార్మికుడి అదృశ్యం... ఆరురోజుల తర్వాత బొగ్గుగనిలో మృతదేహం

By Arun Kumar P  |  First Published Apr 13, 2020, 11:27 AM IST

సింగరేణి బొగ్గుగనిలో ఆరురోజుల క్రితం అదృశ్యమైన కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందం కనుగొంది.  


పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం చోటుచేసుకుంది. ఆరు రోజుల క్రితం 11ఇంక్లైన్ బొగ్గుబావిలో దిగి అదృశ్యమైన కార్మికుడి మృతదేహం లభించింది. ఆరు రోజులుగా గనిలో గాలించిన రెస్క్యూ సిబ్బంది ఎట్టకేలకు అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సింగరేణిలో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న సంజీవ్ మంగళవారం ఒకటో డిప్ వద్ద పంపులను రన్ చేయడానికి వెళ్లి తిరిగి పైకి రాలేదు. దీంతో రాత్రంతా గని లోపల కార్మికుల సాయంతో సింగరేణి అధికారులు గాలించినా అతడి ఆచూకి మాత్రం దొరకలేదు. దీంతో సింగరేణి అధికారులు రెస్క్యూ బృందాన్ని రంగంలోకి దింపారు. 

Latest Videos

గత ఆరు రోజులుగా గని లోపల పూర్తిస్థాయిలో గాలింపుచర్యలు చేపట్టిన సిబ్బంది ఎట్టకేలకు అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కార్మిక సంఘాలు కన్నెర్ర చేస్తాయన్న అనుమానంతో హడావిడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం మృతుడి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. 

సంజీవ్ మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణం అధికారులు తెలియజేయకపోవడంతో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశాలున్నాయి. 
 

click me!