
భోపాల్లో ఉగ్రవాదుల హతం హైదరాబాద్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి భోపాల్ జైల్ నుండి ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న విషయం విధితమే. దాంతో అప్రమత్తమైన పోలీసులు, ఢిల్లీ నుండి కమాండోలను పిలిపించటంతో పాటు యాంటి టెర్రర్ స్క్వాడ్ కూడా జతకలిసి వేటాడారు. ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం వారందరినీ హతం చేసారు. దాంతో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి హైదరాబాద్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.
దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారటంతో పాటు తీవ్రవాదుల, ఉగ్రవాదులకు షెల్టర్ జోన్ గా మారింది. ఈ విఫయంలో ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్ధలు హైదరాబాద్ లోని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి.
ఇటువంటి నేపధ్యంలోనే భోపాల్లో తప్పించుకున్న సిమి ఉగ్రవాదులు హతమవటంతో దేశంలోని పలు ప్రాంతాలను కేంద్ర నిఘా సంస్ధలు అప్రమత్తం చేసాయి. ఇతర ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఉగ్ర చర్యలకు సిమి సానుభూతిపరులు ప్రతీకార దాడులకు దిగే అవకాశాలున్నట్లు కేంద్ర నిఘా సంస్ధల నుండి తెలంగాణా పోలీసులకు హై అలర్ట్ వచ్చినట్లు సమాచారం. అసలు భోపాల్ జైల్లో ఉన్న సిమి ఉగ్రవాదులను తెలంగాణా పోలీసులే పట్టుకుని భోపాల్ పోలీసులకు అప్పజెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఉగ్రచర్యలతో గతంలో హైదరాబాద్ ఎన్నో మార్లు నష్టపోయింది. గోకుల్ ఛాట్ పేలుళ్ళు, లుంబినీ పార్క్ లో పేలుళ్ళు, దిల్షుక్ నగర్ సాయిబాబా ఆలయంలో పేలుళ్ళు లాంటివి చాలా చోట్ల జరిగినపుడు ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అందుకనే కేంద్ర నిఘా సంస్ధలు చేసిన హెచ్చరికలతో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు ఓల్డ్ సిటీతో పాటు అనుమానం ఉన్న పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా తనిఖీలు మొదలుపెట్టారు.