
మిరుదొడ్డిలోని కనకరాజ్ చెరువు కాలువ ధ్వంసం చేసిన విషయంలో ఆ గ్రామ రైతులు నర్సింహ్మారెడ్డి, కొమురయ్య యాదవ్ అనే వ్యక్తుల మద్య వివాదం నెలకొంది. దీనిపై గ్రామ పెద్దలు పంచాయతీ చేసి తీర్పు చెప్పారు. తీర్పు నర్సింహ్మారెడ్డికి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఈ పంచాయితీని పోలీసు స్టేషన్ కు తీసుకుపోయిండు నర్సింహ్మారెడ్డి.
ఇక ఈ పంచాయితీ విషయంలో నర్సింహ్మారెడ్డికి వకాల్తా పుచ్చుకున్న ఎస్సై సతీష్ పలుమార్లు స్టేషన్ కు రావాలంటూ కొమురయ్య యాదవ్ ను పిలిచాడు. కానీ కొమురయ్య రాలేదు. తీరా వత్తిడి పెరగడంతో ఆదివారం స్టేసన్ కు తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. ఎన్నిసార్లు పిలిచినా ఎందుకు స్టేషన్ రాలేదు అంటూ ఎస్సై కొమురయ్యను దుర్భాషలాడారు. అయితే తన తప్పేమీ లేదని కొమురయ్య సమాధానమిచ్చాడు.
కానీ ఇంతలోనే కల్పించుకున్న కానిస్టేబుల్ నాగిరడ్డి... ఎన్నిసార్లు పిలిచినా రావా నీకు అంత బలుపా? పెద్ద సారు చెప్పినా ఎందుకు రాలేదంటూ దివ్యాంగుడైన కొమరయ్య యాదవ్ పై దాడిచేశాడు. అది చాలదన్నట్లు ఎస్సై కూడా కొమురయ్యను చితకబాదాడు. వికలాంగుడిని పట్టుకుని ఎందుకు కొడుతున్నారని కొమురయ్య బాబాయి మల్లేషం వారిస్తుంటే నువ్వేందిరా చెప్పేది అంటూ ఆయనను సైతం చితకబాదాడు ఎస్సై సతీష్. దీనిపై సిద్ధిపేట అంతటా ఆందోళన జరుగుతోంది.