
తాండూరు: విధి నిర్వహణలో చాలా కఠినంగా వుండే పోలీసులు అవసరమైతే అంతకంటే ఎక్కువ మానవత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల పోలీసులు మానవత్వాన్ని చాటిన సంఘటనలు ఇటీవలే బయటడ్డాయి. ఓ మహిళా ఎస్సై అనాధ శవాన్ని మోయడం, మరోచోట కుళ్లిన శవాన్ని పోలీసు సిబ్బంది మోసిన సంఘటనలు పోలీసుల మానవీయ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి. అలాంటి ఘటనే తాజాగా తెలంగాణలోనూ చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన నర్సిములు(30)అనే యువకుడు హోలీ వేడుకల్లో పాల్గొని స్నానం చేసేందుకు ఓ పురాతన బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఈత రాకపోవడం, కాపాడేందుకు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు.
యువకుడి మృతదేహాన్ని బావిలో గుర్తించిన గ్రామస్తులు స్థానిక కరన్ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బావి వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయాల్సిందిగా గ్రామస్తులను కోరారు. అయితే పురాతన బావి కావడం, నీరు ఎక్కువగా వుండటంతో బావిలోకి దిగేందుకు గ్రామస్తులెవ్వరూ సాహసించలేదు. దీంతో స్వయంగా కరన్ కోట్ ఎస్సై ఏడుకొండలే రంగంలోకి దిగారు. నడుముకు తాళ్లు కట్టుకొని స్వయంగా బావిలోకి దిగిన ఎస్సై మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు.
ఇలా సాహసోపేతంగా వ్యవహరించిన ఎస్సైని గ్రామస్తులు అభినందించారు. బావిలోంచి ఎస్సై బయటకు రాగానే చప్పట్లతో అభినందించారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.