
హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో దారుణం జరిగింది. భార్యభర్తల గొడవ అపార్ట్ మెంట్ లో దుర్వాసనకు కారణమయ్యింది. భర్తను హత్యచేసి.. ఎంచక్కా ఫ్రిజ్ లో పెట్టి భార్య, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ షాకింగ్ ఘటన స్తానికంగా తీవ్ర కలకలానికి దారి తీసింది.
వివరాల్లోకి వెడితే.. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్ లోని ఓ ప్లాట్ లో నుండి దుర్వాసన రావడంతో పక్క ప్లాట్స్ వాళ్లు ఓనర్ కి తెలిపారు. ఆ ప్లాట్లో సిద్దిఖ్ అహ్మద్ అనే 38 ఏళ్ల వ్యక్తి తన భార్య రుబీనా, పిల్లలతో అద్దెకు ఉంటున్నాడు.
ఇంటికి తాళం వేసి ఉంది. రుబీనా రెండు రోజుల కిందటే పిలల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. సిద్దిఖ్ అహ్మద్ జాడ తెలియలేదు. ఆ తరువాతి నుంచి వాసన రావడంతో గందరగోళం మొదలయింది. వెంటనే ఓనర్ పోలీసులకు ఫోన్ చేశాడు.
వారు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇళ్లంతా నీట్ గా సర్దిపెట్టి ఉంది. ఎక్కడా ఏమీ దొరకలేదు. కాకపోతే వాసన మాత్రం ఆ ఇంట్లోనుంచే వస్తుంది. ఇళ్లంతా వెతికి, చివరకు అనుమానంతో పోలీసులు ఫ్రిజ్ ఓపెన్ చేసి చూశారు. అందులో ఓ శవం ఉంది.
ఎవర్నో చంపి, ప్రిజ్ లో కుక్కి మరీ ఆ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని తెలిసింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
పోలీసుల విచారణలో ఆ శవం సిద్దిఖ్ అహ్మద్ దే అని యజమాని గుర్తించాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. భర్తను హత్యచేసి, ఫ్రిజ్ లో పెట్టి ఏమీ ఎరగనట్టు ఇంటికి తాళం వేసి వెళ్లిన భార్యగురించి అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.
హత్యకు దారి తీసిన పరిస్థితులేంటి..? భార్యాభర్తల మధ్య విబేధాలు ఉన్నాయా? అందరూ అనుకుంటున్నట్లు హత్యకు భార్యకు సంబంధం ఉందా? వివాహేతర సంబంధాలు ఏమైనా ఈ ఘటనకు కారణమా? ఆస్తి గొడవలు ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు.
పుట్టింటికి వెళ్లిన భార్యకు, భర్త మరణం గురించి సమాచారం అందించారు. విచారణకుపోలీస్ స్టేషన్ కు త్వరలోనే పిలిపిస్తామని తెలిపారు. దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.