హైద్రాబాద్ మియాపూర్‌లో ప్రేమోన్మాది దాడి: యువతి తల్లి శోభ మృతి

By narsimha lode  |  First Published Dec 14, 2022, 9:50 AM IST

హైద్రాబాద్ నగరంలోని మియాపూర్  ఆదిత్యనగర్ లో  ప్రేమోన్మాది సందీప్  చేసిన దాడిలో  యువతి తల్లి  శోభ మృతి చెందింది.


హైదరాబాద్: నగరంలోని  మియాపూర్ ఆదిత్యనగర్ లో  నిన్న సందీప్ దాడిలో  యువతి  తల్లి శోభ బుధవారంనాడు ఉదయం మృతి చెందింది.ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇసుకపల్లికి చెందిన  వెంకటరాజు శోభ దంపతులకు  ఇద్దరు పిల్లలు.  ఓ కొడుకు, కూతురున్నారు.  వెంకటరాజు  ఇంటికి సమీపంలోనే  సందీప్ అనే యువకుడి కుటుంబం నివాసం ఉంటుంది.  వెంకటరాజు కూతురికి, సందీప్ మధ్య కొంత కాలం పాటు  ప్రేమాయణం సాగింది. దీంతో వీరిద్దరికి  నిశ్చితార్ధం  చేశారు. అయితే సందీప్  వైఖరి  నచ్చక నిశ్చితార్ధం  కూడా  క్యాన్సిల్  చేసుకున్నారు యువతి కుటుంబసభ్యులు. ఇటీవలే మరోక యువకుడితో  యువతికి నిశ్చితార్ధం  జరిగింది.  అదే  సమయంలో గుంటూరు జిల్లా నుండి  హైద్రాబాద్ కు  మకాం మార్చారు  వైభవి కుటుంబసభ్యులు. వైభవి తండ్రి మాత్రం గుంటూరులోనే ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి యువతి తల్లి హైద్రాబాద్  మియాపూర్ ఆదిత్యనగర్ లో నివాసం ఉంటుంది.

నిన్న ఉదయం  హైద్రాబాద్ లోని మియాపూర్ ఆదిత్యనగర్ కు వచ్చిన సందీప్  యువతిపై కత్తితో దాడికి దిగాడు.యువతి కేకలు విన్న తల్లి  అడ్డుకొంది.ఈ ఘటనలో  యువతి తల్లి శోభకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిపై కత్తితో దాడి చేసిన సందీప్  ఆ తర్వాత తాను గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  తల్లీ కూతుళ్ల కేకలు విన్న ఇంటి యజమాని  అక్కడికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు.  సందీప్ దాడిలో తీవ్రంగా గాయపడిన  వైభవి తల్లి గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ  మృతి చెందింది.

Latest Videos

also read:హైద్రాబాద్ మియాపూర్ లో దారుణం: యువతిపై కత్తితో దాడి, ఆత్మాహత్యాయత్నం చేసిన యువకుడు

గాయపడిన  తల్లీ కూతుళ్లను ప్రైవేట్  ఆసుపత్రిలో  చేర్పించారు.  ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత  నిన్న సాయంత్రం నాలుగు గంటలకు  గాంధీ ఆసుపత్రికి  శోభను తరలించారు.  గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శోభ ఇవాళ తెల్లవారుజామున మృతి చెంందింది. శోభ మృతదేహన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం తర్వాత  శోభ మృతదేహన్ని ఇవాళ అప్పగించనున్నారు. 

మరో వైపు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సందీప్  పరిస్థితి నిలకడగా ఉందని  పోలీసులు చెబుతున్నారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో  సందీప్‌నకు సర్జరీ చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జీ చేసిన తర్వాత  సందీప్ ను  పోలీసులు అరెస్ట్  చేసే అవకాశం ఉంది.  సందీప్ దాడిలో గాయపడిన  యువతి ఆసుపత్రిలో  కోలుకుంటుందని  వైద్యులు చెబుతున్నారు.తననే పెళ్లి చేసుకోవాలని సందీప్  యువతిని కొంత కాలంగా  వేధింపులకు గురి చేస్తున్నారని  బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.మరోక యువకుడితో  నిశ్చితార్ధం జరగడంతో  సందీప్  కక్షగట్టి  యువతిపై దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

 


 


 

click me!