తాజాగా శంషాబాద్ ఎస్సై ఒక మద్యం షాపు విషయంలో చేతివాటాన్ని చూపెట్టడంతో అతడిని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది పోలీసు శాఖ
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నవేళ పోలీసులు ముందు వరసలో ఉంటూ, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నారు. ఇలా పోలీసులందరు కష్టపడుతుంటే... కొందరు పోలీసులు మాత్రం తమ చేతివాటాన్ని చూపెడుతూ... మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చేవారులా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా శంషాబాద్ ఎస్సై ఒక మద్యం షాపు విషయంలో చేతివాటాన్ని చూపెట్టడంతో అతడిని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది పోలీసు శాఖ. వివరాల్లోకి వెళితే.... శంషాబాద్ ఎస్సై మార్చ్ 31వ తేదీనాడు, లాక్ డౌన్ ఉన్నా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకొని అక్కడకు వెళ్లి రైడింగ్ నిర్వహించి పట్టుకున్నారు.
undefined
అక్కడ రెడ్ హ్యాండెడ్ గా బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తున్నవారిని పట్టుకొని అరెస్ట్ చేసారు. మద్యం కొనేందుకు వచ్చినవారిని, అమ్ముతున్నవారిని అరెస్ట్ చేసి కేసు కూడా నమోదు చేసారు. డబ్బును సీజ్ చేసారు.
కొన్ని రోజుల తరువాత ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తున్న సీనియర్ అధికారులు ఒక్కసారిగా ఈ ఎస్సై నిర్వాకాన్ని చూసి నివ్వెర పోయారు. కేవలం ఎక్సయిజ్ చట్టం కింద కేసు నమోదు చేసారు తప్ప, ఈ లాక్ డౌన్ వేళ అమలులో ఉన్న అంటువ్యాధుల నివారణ చట్టం కింద కానీ, విపత్తు నిర్వహణ చట్టం కిందకాని కేసు నమోదు చేయలేదు.
అసలు ముఖ్యమైన చట్టాల కింద కేసులు నమోదు చేయకుండా ఉదాసీనత ఎందుకు ప్రదర్శించాడు అనే విషయమై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. అంతే కాకుండా అక్కడ సీజ్ చేసిన డబ్బులో కూడా కొంత మొత్తాన్ని తిరిగి సదరు మద్యం వ్యాపారులకు తిరిగి ఇచ్చినట్టు కూడా తెలియవస్తుంది.
ఈ నేపథ్యంలో ఆ సదరు ఎస్సైని హెడ్ క్వార్టర్స్ కి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు. శంషాబాద్ ఏసీపీని ఈ విషయాన్నీ దర్యాప్తు చేయవలిసిందిగా ఆదేశించింది పోలీసు శాఖ. ఈ విచారణ పూర్తయ్యేంతవరకు సదరు ఎస్సై సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయవలిసి ఉంటుంది.