ప్రేమ పేరుతో వెెంటపడుతూ కోరిక తీర్చాలంటూ ఓ దుర్మార్గుడి వేధింపులను తట్టుకోలేక మనస్తాపంతో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం: వివాహమై భార్యతో వుంటూనే మరో యువతిని ప్రేమ పేరుతో వేధింపులకు దిగాడు ఓ దుర్మార్గుడు. తనపైనే ఆదారపడిన కుటుంబాన్ని చాలిచాలని జీతంతో నెట్టుకువస్తున్న సదరు మైనర్ బాలిక అతడి వేధింపులను తట్టుకోలేకపోయింది. ఈ మధ్య అతడి వేధింపులు మరీ ఎక్కువ కావడంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామానికి చెందిన వర్షిత(17)పై చిన్న వయసులోని కుటుంబ పోషణ భారం పడింది. తండ్రి చనిపోవడంతో వర్షితకు తన కాళ్ళపై తాను నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా చేరిన ఆమె చాలిచాలని జీతంతో కుటుంబ అవసరాలు, తన అవసరాలు చూసుకుంటోంది. పట్టణంలోని ఓ ఉమెన్స్ హాస్టల్ లో నివాసముంటూ ఉంటోంది.
ముందే పుట్టెడు కష్టాలతో సతమతం అవుతున్న వర్షితను మల్లవరపు మధుకుమార్ అనే వివాహితుడు ప్రేమపేరిట వేధించడం ప్రారంభించాడు. ఆమె పనిచేసే హాస్పిటల్ లోనే పనిచేసే అతడు తనను ప్రేమించాలంటూ వేధించడమే కాదు ఆమె జీతం డబ్బులను సైతం బలవంతంగా తీసుకునేవాడు. అతడి వేధింపులను తట్టుకోలేక వర్షిత అక్కడ ఉద్యోగం మానేసి మరో హాస్పిటల్ లో చేరింది. అయినప్పటికి మధు వేధించడం ఆపలేదు.
read more తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!!
ఒకే దగ్గర పనిచేసే క్రమంలో గతంలో పలుమార్లు మధుతో ఫోన్ లో మాట్లాడింది వర్షిత. ఈ మాటలను రికార్డ్ చేసిన మధు దీన్ని బయటపెడతానంటూ బెదిరించాడు. ఇలా తనను ప్రేమించి కోరిక తీర్చమంటూ అతడి వేధింపులు మితిమీరడంతో ఏం చేయాలో తోచని వర్షిత చివరకు ప్రాణాలు తీసుకోడానికి సిద్దపడింది.
నిన్న(సోమవారం) ఉదయం తన స్నేహితురాలికి ఫోన్ చేసిన వర్షిత ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో స్నేహితురాలు వెంటనే వర్షిత తల్లికి ఫోన్ చేయగా ఆమె ఖమ్మం చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహం పక్కన ఇంజక్షన్, సిరంజీ ఉండడంతో శరీరంలోకి విషం ఎక్కించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. వర్షిత తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు మధుకుమార్‌పై పోక్సోతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో వున్న అతడి కోసం గాలిస్తున్నారు.