తెలంగాణలో 'ఆమె' కు రక్షణ లేదా.. ? ఏడాదికేడాది పెరుగుతున్న లైంగిక నేరాలు 

By Rajesh KarampooriFirst Published Dec 10, 2022, 11:18 AM IST
Highlights

తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందనీ, రోజురోజుకు వారిపై దాడులు పెరుగుతున్నాయని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. మన రాష్ట్రంలో లైంగిక వేధింపులు 2020 నుండి 2021 వరకు 17 శాతానికి పైగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కఠినతర చట్టాలు తెచ్చి సంవత్సరాలు గడుస్తున్నా వారిపై జరుగుతున్న దాడులు విషయంలో మాత్రం మార్పు రావడంలో లేదు.పైగా తెలంగాణలో ఏడాదికేడాది ఆ సంఖ్య పెరుగుతుంది. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.  తెలంగాణలో మహిళలపై లైంగిక వేధింపులు 2020 నుండి 2021 వరకు 17 శాతానికి పైగా పెరిగాయని కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

 2021లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి 20,865 కేసులు నమోదయ్యాయని, 2020లో 17,791 కేసులు, 2019లో 18,394 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి ఉందని, 2019లో దేశవ్యాప్తంగా 4,05,326 కేసులు నమోదు కాగా, 2020లో 3,71,503 కేసులు, 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. 

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం షీ టీం ఏర్పాటు, లైంగిక నేరాల కోసం దర్యాప్తు ట్రాకింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ట్రాకింగ్, దర్యాప్తు పర్యవేక్షణ కోసం ఆన్‌లైన్ విశ్లేషణ సాధనం. లైంగిక నేరస్థులపై డేటాబేస్ (NDSO) రూపొందించినట్లు తెలిపింది.

2016-17 నుంచి 2021-22 వరకు నిర్భయ నిధుల్లో( Nirbhaya Funds) 16 శాతం నిధులను వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. తెలంగాణకు కేంద్రం రూ.238.06 కోట్లు విడుదల చేసిందని, అందులో రాష్ట్రం రూ.200.95 కోట్లు వినియోగించుకుందని పేర్కొంది. మహిళల భద్రత , రక్షణను పెంపొందించడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను అమలు చేయడానికి ఈ నిధిని ఏర్పాటు చేశారు.


మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలోని మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే ఉందని తెలుస్తోంది. కోవిడ్ సమయంలో మహిళలపై దాడులు, నేరాలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు తీవ్రమయ్యాయని  ఈ డేటా ద్వారా తెలుస్తోంది.అత్యాచారాలు, హత్యలతో పాటు మహిళలు, చిన్నారులు మానసిక వేధింపులకు కూడా గురవుతున్నారని మంత్రిత్వ శాఖ డేటా ద్వారా తెలుస్తుంది.

ఇలాంటి జరిగిన నేరాలను పరిశీలిస్తే.. ఎక్కువమంది మహిళలు తెలిసిన వాళ్లు, బంధువుల చేతుల్లోనే హింసకు గురవుతున్నట్టు తెలుస్తోంది. మహిళలకు బయటనే కాదు.. ఇళ్లలోనూ రక్షణ కరువైంది. సమాజంలో లింగ అసమానతకు ముగింపు పలికినప్పుడే మహిళలు, చిన్నారులపై దాడులు తగ్గుతాయని మహిళా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

click me!