
నల్గొండ జిల్లాలోని (Nalgonda District) చింతపల్లి మండలంలో దారుణ హత్య జరిగింది. మైసమ్మ గుడి వద్ద మొండెం లేని మనిషి తల కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు.. హైదరాబాద్-నాగార్జున రాష్ట్ర రహదారిని అనుకుని చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లో ఉన్న మెట్టు మహంకాళి దేవాలయంలో తల భాగాన్ని వదిలివెళ్లారు. మైసమ్మ గుడి ముందు ఉన్న పోతురాజు విగ్రహం వద్ద తలను ఉంచారు. సోమవారం ఉదయం దీనిని గుర్తించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుకు సమాచారం అందించారు.
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇతర శరీరభాగాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఆ తల ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అర్దరాత్రి వేళ నరబలి జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆ వ్యక్తిని ఆలయం వద్దే హత్య చేశారా..? లేక ఎక్కడైనా హత్య చేసిన తలను ఇక్కడకు తీసుకొచ్చి వదిలివెళ్లారా..? అనేది తేలాల్సి ఉంది. ఇక, ఇది హత్య..? లేక నరబలా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.