
మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్ని మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు మునుగోడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్.. నియోజకవర్గంలో పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించింది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చలు జరుపుతోంది.
అయితే ఇదిలా ఉంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు సగం మంది కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 71 ఎంపీటీసీలు, 159 సర్పంచ్‌లకు గాను.. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. టీఆర్‌ఎస్ 38 ఎంపీటీసీలు, 88 సర్పంచ్‌లను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 32 ఎంపీటీసీలు, 57 మంది సర్పంచ్‌లు ఉన్నారు. ఇతరులకు ఒక ఎంపీటీసీ, 14 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచ్‌లను తన వెంట బీజేపీలో చేరేలా ఒప్పించలేకపోయారు. దీంతో ఇప్పటివరకు డజను మంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కూడా బీజేపీలో చేరలేదు.
Also Read: హైకమాండ్‌తో ముగిసిన టీ.కాంగ్రెస్ నేతల భేటీ.. త్వరలోనే మునుగోడు అభ్యర్ధి ప్రకటన : రేవంత్ రెడ్డి
అయితే ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో వేగంగా పావులు కదుపుతుంది. టీఆర్‌ఎస్ తరుపున మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్‌గా ఉన్న ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి.. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలను గులాబీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ స్థానిక నేతలను చేర్చుకోవడం వల్ల ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశాలు పెరుగుతాయని టీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి కొత్త చేరికలు, వామపక్షాల మద్దతుతో టీఆర్‌ఎస్‌కు సులభతరమైన విజయం ఖాయమనే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుందని, కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో నిలుస్తుందని తమ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పినట్టుగా డెక్కన్ క్రానికల్ తన కథనంలో పేర్కొంది. బీజేపీ నేతలు, రాజ్‌గోపాల్‌రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి మీడియా, సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తున్నారని.. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని చెప్పారు.