మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలు ఇవాళ ఆయనతో భేటీ అయ్యారు.
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు మంగళవారంనాడు భేటీ అయ్యారు.పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో పాలేరు నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావును పాలేరుకు చెందిన ప్రజాప్రతినిధులు కోరారు. పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే గెలిపించుకుంటామని వారు చెప్పారని సమాచారం.
also read:తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారు: భట్టి విక్రమార్క సంచలనం
ఈ నెల 21న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కలేదు. ఈ ఏడాది చివరలో జరిగే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఆయనకు టిక్కెట్టు ఇవ్వలేదు. పాలేరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి మరోసారి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. ఈ పరిణామం తుమ్మల నాగేశ్వరరావును తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నుండి తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. అయితే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని ఆయన వర్గీయుల్లో ప్రచారం సాగుతుంది. తుమ్మల నాగేశ్వరరావు తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టు నిరాకరించడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. అయితే ఎన్నికల తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకు నామినేటేడ్ పదవిని కేటాయించే విషయమై తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ సమాచారం పంపారు.ఈ విషయమై ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ద్వారా తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ సమాచారం పంపారు.
అయితే ఈ ప్రతిపాదనపై తుమ్మల నాగేశ్వరరావు సంతృప్తి చెందలేదని ఆయన వర్గీయుల్లో ప్రచారంలో లేదు. ఈ సమావేశం ముగిసిన తర్వాతే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమై పాలేరు నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.తుమ్మల నాగేశ్వరరావు ఆశ్వరావుపేట నియోజకవర్గపరిధిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు సమావేశమౌతున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.