
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ తీరు మరోసారి ఆ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమవుతుంది. కొంతకాలంగా అంతా బాగానే ఉన్నట్టు కనిపించిన.. మరోసారి రేవంత్ తీరుపై కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు నేతలు రేవంత్‌పై బహిరంగంగా కామెంట్ చేసిన.. పలువురు సినీయర్లు మాత్రం లోలోపల రగిలిపోతున్నారు. పార్టీలో రేవంత్ వన్ మ్యాన్ షోపై మండిపడుతున్నారు. ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం, నిరనస కార్యక్రమాలను చేపట్టడం.. ఇలా పలు విషయాల్లో రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ చేపట్టిన ధరణి రచ్చబండ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించడంపై కూడా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఢిల్లీ వేదికగా పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలు, వాటి తేదీల గురించి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని.. అయితే అందుకు సంబంధించి పార్టీ కేంద్ర నాయకత్వంతో ఎటువంటి చర్చ జరగలేదని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు చెప్పినట్టుగా డెక్కన్ క్రానికల్ ఓ కథనంలో పేర్కొంది. మరోవైపు ఇతర పార్టీల నుంచి రేవంత్‌కు మద్దతుగా ఉండేవారిని మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై కొందరు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి వారితో భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అటువంటి వారిని రానున్న ఎన్నికల్లో టికెట్స్ ఇస్తే.. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే వారు పార్టీకి విధేయత చూపకపోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో రేవంత్ వ్యుహాలను వారు వ్యతిరేకిస్తున్నారు.
మరోవైపు పార్టీలో చేరికలకు సంబంధించి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ నేత జానా రెడ్డి కూడా తాజా పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఇటీవల పీజేఆర్ కూతురు విజయారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా కొత్తవారిని చేర్చుకోవడం ద్వారా పార్టీగా చాలా కాలంగా విధేయులుగా ఉంటున్నవారి ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ కడూ ఆ అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా పార్టీకి విధేయులుగా ఉంటూ..గత ఎనిమిదేళ్లలో నష్టపోయిన నాయకుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది’’ అని ఒక సీనియర్ నేత చెప్పారు.
ఇక, కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో రెడ్డిల ఆధిక్యతపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై, పీసీసీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలను సస్పెండ్ చేయడంపై కూడా పలువురు నేతలు రేవంత్ గురించి అధిష్టానాన్ని ఫిర్యాదులు వెళ్లినట్టుగా తెలస్తోంది. మరోవైపు ఇటీవల టీ కాంగ్రెస్‌లో రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి వ్యవహారం మరోసారి హీట్ పెంచింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన.. నేతల మధ్య మాటల యుద్దానికి దారితీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం.. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, నేతల మధ్య విబేధాలు, పార్టీలో చేరికలు.. తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పార్టీలో నేతల మధ్య అభిప్రాయ భేదాలను అసమ్మతిగా ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
అయితే కొందరు సీనియర్లు మాత్రం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సహనం కోల్పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఆయన తాను వినియోగించే పదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇక, కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు, విబేధాలు లేవని పైకి చెబుతున్న.. లోలోపల అవి కొనసాగుతూనే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలా లేకుంటే అది కాంగ్రెస్ కాదేమోనని ఆలోచించాల్సి ఉంటుందని వారు అంటున్నారు.