బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తమ పేర్ల కోసం ఆశావాహులు చివరి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ మేరకు కల్వకుంట్ల కవితతో కొందరు ఆశావాహులు ప్రయత్నాలు ప్రారంభించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఇవాళ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి ఆశావాహులు క్యూ కట్టారు. తమకు టిక్కెట్టు వచ్చేలా చూడాలని కవితను నేతలు కోరుతున్నారు. బీఆర్ఎస్ జాబితాలో చోటు దక్కదనే ప్రచారం సాగుతున్న నేతలు కవిత ఇంటికి వచ్చి ఆమెతో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ దంపతులు కవితతో భేటీ అయ్యారు.
రేఖా నాయక్ కు ఈ దఫా టిక్కెట్టు రాదనే ప్రచారం సాగుతుంది. దీంతో ఆమె కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.మరో వైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ కు చెందిన సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సమావేశమయ్యారు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగుతుంది. మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
మరో వైపు జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడ కవితతో సమావేశమయ్యారు. జనగామ అసెంబ్లీ స్థానం నుండి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తప్పించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికే టిక్కెట్టు ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. మరో వైపు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కుటుంబ సభ్యులు కవితతో సమావేశమయ్యారు. నేతలతో సమావేశం ముగిసిన తర్వాత కవిత ప్రగతి భవన్ కు చేరుకున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. మంత్రి హరీష్ రావు కూడ ప్రగతి భవన్ లోనే ఉన్నారు. దీంతో ఆశావాహులు కవితతో సమావేశమై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆశావాహుల అభిప్రాయాలను కవిత సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. అయితే చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తమకు అవకాశం దక్కేలా ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు.