ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ మార్కులు కలపమని హైకోర్టు ఆదేశాలు.. అర్హతపొందినవారు ఏం చేయాలంటే

By SumaBala BukkaFirst Published Jan 30, 2023, 9:32 AM IST
Highlights

మార్కులు కలిపిన తరువాత అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో పెడతారు. వారు ఫిజికల్ టెస్ట్ లకు అర్హతసాధిస్తారు.

హైదరాబాద్ ఫ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాథమిక రాత పరీక్షల్లో మల్టిపుల్ ఆన్సర్ ప్రశ్నలకు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అర్హులైన వారికి ఫిజికల్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది.  ఆదివారం ఓ ప్రకటనలో.. వచ్చే నెల 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు..  ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయనున్నట్లు బోర్డు చైర్మన్ పివి శ్రీనివాసరావు  తెలిపారు. 

మార్కులు కలిపిన తర్వాత అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను.. వారి హాల్ టికెట్ల నెంబర్లను సోమవారం నాడు www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత సాధించే అభ్యర్థులకు టీఎస్ఎల్పిఆర్బి కొన్ని సూచనలు చేసింది. మార్కులు కలపడం ద్వారా ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో పార్ట్ టు దరఖాస్తులు నింపాలని తెలిపింది. అర్హత వివరాల వెల్లడి..  అభ్యర్థుల ప్రకటన తర్వాత.. ఈ ఆన్లైన్ పార్ట్ టు దరఖాస్తు నింపడానికి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు  గడువు విధించింది. ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు నింపవచ్చు.  ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులు నింపడానికి చివరి సమయంగా  కేటాయించింది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.. నేడు విచారణ..

అయితే ఇప్పటికే ఎస్ఐ లేదా కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించిన వారు.. ఈ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో రాత పరీక్షలో అర్హత సాధిస్తే.. ఆ అభ్యర్థులు మళ్లీ పార్ట్ టు దరఖాస్తు  నింపాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే,  ఇప్పటికే ఫిజికల్ టెస్ట్ లకు హాజరై అర్హత సాధించని  అభ్యర్థులు.. ఒకవేళ ఇప్పుడు తాజాగా బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల, మార్కులు కలపడం ద్వారా రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ.. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షల్లో విఫలమైనందున మరోసారి అవకాశం ఉండదని పోలీస్ బోర్డు స్పష్టం చేసింది.

ఇప్పుడు మార్కులు కలిపితే కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ ఈవెంట్ పరీక్షలకు అర్హత లభిస్తుందని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు తెలిపారు. గతంలో దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొని విఫలమైన వారికి అవకాశం ఉండదని  స్పష్టంగా తెలిపారు. ఈ ఫిజికల్ ఈవెంట్స్ ను హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ ఆదిలాబాద్ లో నిర్వహిస్తామని..  వీటిని పది రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.   

ఇక ఈవెంట్స్ కు సంబంధించి  అడ్మిట్ కార్డులను  టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్ నుంచి ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి..  ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని  సూచించారు. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ లో సమస్యలు ఉంటే.. వెంటనే 9393711110, 9391005006నెంబర్లకు ఫోన్లు చేసి  వివరాలు చెప్పవచ్చని తెలిపారు.

click me!