తమిళిసై వర్సెస్ కేసీఆర్ : బడ్జెట్ కు గవర్నర్ సిఫారసులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్..

By SumaBala BukkaFirst Published Jan 30, 2023, 8:11 AM IST
Highlights

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మీద రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. బడ్జెట్ ప్రతిపాదనలకు ఇంకా ఆమోదం రాని నేపథ్యంలో.. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. 

హైదరాబాద్ : 2023 -24 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనకు రాష్ట్ర గవర్నర్ తమిళ్ సౌందర్య రాజన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ సిఫారసులతో బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రాష్ట్ర గవర్నర్ సిఫార్సుల కోసం రాజ్ భవన్ కు పంపించింది.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో.. ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఇంకా ఆమోదం లభించలేదు. అవి రాజ్ భవన్ లోనే ఉన్నాయి. కాగా, రాజ్ భవన్ వర్గాలు దీని మీద మాట్లాడుతూ.. సోమవారం గవర్నర్ హైదరాబాద్కు వస్తారని  తెలిపాయి. ఆమె వచ్చిన తర్వాత  బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించి, ప్రభుత్వానికి తిరిగి పంపించే విషయం నిర్ణయం తీసుకుంటారని చెప్పాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య విభేదాలు ఉన్న తెలిసిన సంగతే.  శాసనసభ బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించడం ఆనవాయితీ. అయితే దీనికి విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం లేకుండానే నిరుడు బడ్జెట్ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 

బాలింతల మృతిలాంటి ఘటనలు రిపీటైతే కఠినచర్యలు.. వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు హెచ్చరిక..

దీనికోసం ఒక సాంకేతిక వెసులుబాటును ఉపయోగించుకుంది.  అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోవడంతో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించవచ్చు. నిరుడు దీనినే ఉపయోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం..  ఈ యేడు కూడా ఈ సాంకేతిక వెసులుబాటునే ఉపయోగించుకుని బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి సిద్ధపడింది. నిరుడు బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగాన్ని రద్దు చేయడం విషయంలో తమిళి సై సౌందర్యరాజన్  రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడింది.  

తనను అవమానించడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రసంగాన్ని రద్దు చేసిందని తెలిపింది. అయితే, తాను మాత్రం ప్రభుత్వం పంపిన  బడ్జెట్ట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని.. సిఫారసు చేశాను అని అన్నారు.  అంతేకాదు, అప్పట్లోనే ఆమె మాట్లాడుతూ తాను తలచుకుంటే బడ్జెట్ ప్రతిపాదనలను సిఫారసు చేయకుండా పెండింగ్లో పెట్టగలనని అన్నారు.

అయితే,  ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్కు మధ్య మరింత దూరం పెరిగిన నేపథ్యంలో ఈ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల ప్రోటోకాల్.. వివిధ అంశాల నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నిరుడు ప్రస్తావించినట్లుగా బడ్జెట్ ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం చెప్పలేదని..  పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది.  సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. 

click me!