ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వలసలు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ కార్పొరేటర్ దంపతులు కాంగ్రెస్ లో చేరారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్పోరేటర్ దంపతులు కాంగ్రెస్ లోకి వచ్చారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ దంపతులైన జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు భారీ ర్యాలీతో బయలుదేరి కాంగ్రెస్ లో చేరారు. దీనికి ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో అనుచరులు, కార్యకర్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లి నుంచి జగదీశ్వర్ గౌడ్ మూడు సార్లు కార్పొరేటర్ గా గెలిచారు.
ఆయన సతీమణి పూజిత కూడా రెండుసార్లు కార్పొరేటర్ గా గెలిచారు. ఇప్పుడు ఈ దంపతులిద్దరూ కాంగ్రెస్ లో చేరడంతో హైటెక్ సిటీ కాంగ్రెస్ ఖాతాలో పడబోతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ దంపతులు పార్టీ మారడంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిల మధ్య త్రిముఖ పోటీ ఉండచ్చని విశ్లేషకులు అంటున్నారు. మొదట్లో జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ కార్పొరేటర్ గానే ఇక్కడి నుంచి గెలిచారు. ఆ తరువాత బిఆర్ఎస్లోకి మారిన ఆయన మళ్లీ బిఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు.
undefined
ఇక జగదీశ్వర్ గౌడ్ భార్య పూజిత హఫీజ్పేట్ డివిజన్ నుంచి రెండుసార్లు గెలిచారు. ఆమె గెలుపులోను జగదీశ్వర్ గౌడ్ కీలకంగా ఉన్నారు. జగదీశ్వర్ గౌడ్, ఆయన భార్య పూజితకు వచ్చిన మెజారిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 10 డివిజన్లలో 8 డివిజన్ల కార్పొరేటర్లకు వచ్చిన మెజారిటీ కంటే వీరికి వచ్చిన మెజార్టీ ఎక్కువగా ఉంది.
ఇప్పుడు జగదీశ్వర్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీ పార్టీకి నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గాంధీ హఫీజ్పేట్, మాదాపూర్ డివిజన్లలో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. పార్టీకి నష్టం వాటిళ్లకుండా ప్రయత్నిస్తున్నారు.