ఊహాకి కూడా అందని నేరాలతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. దిశ హత్యాచారం, ఎమ్మార్వోపై సజీవదహనం, హాజీపూర్ అత్యాచార కేసులతో పాటు మరిన్ని నేరాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
ఊహాకి కూడా అందని నేరాలతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. దిశ హత్యాచారం, ఎమ్మార్వోపై సజీవదహనం, హాజీపూర్ అత్యాచార కేసులతో పాటు మరిన్ని నేరాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపపై ప్రవీణ్ అనే మృగాడు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఏడాది జూన్ 18న అర్థరాత్రి ఓ ఇంటిలోకి చొరబడిన నిందితుడు ప్రవీణ్ 9 నెలల చిన్నారిని అపహరించి, నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేశాడు.
undefined
ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో జనం భగ్గుమన్నారు. నిందితుడు ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలంటూ జనం రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహించారు. కేసును సీరియస్‌గా తీసుకున్న వరంగల్ పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి కీలక ఆధారాలు సేకరించారు.
అనంతరం 51 రోజుల్లోనే విచారణను పూర్తి చేసిన వరంగల్ కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించింది. అయితే ప్రవీణ్ దీనిపై హైకోర్టుకు అప్పీల్ చేసుకోవడంతో అతని శిక్షను ఉన్నత న్యాయస్థానం జీవితఖైదుగా మార్చింది. పోలీసులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలికల అత్యాచారం హత్య కేసులో ఇంతకుమించి సంచలనం కలిగించింది. 2015 నుంచి గ్రామంలో కనిపించకుండా పోయిన మనీషా, కల్పన, శ్రావణి అనే బాలికలపై శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడు అత్యాచారం చేసి దగ్గరలోని బావిలో పూడ్చిపెట్టినట్లు గ్రామస్తులు అనుమానించారు.
అనంతరం పోలీసులు సైతం బావిలో తవ్వకాలు జరపగా.. మృతదేహాల ఆనవాళ్లు లభించాయి. ముగ్గురు మైనర్లపై హత్యాచారానికి పాల్పడిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను పూర్తి చేసింది. దీంతో న్యాయస్థానం ఏం తీర్పును వెలువరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.
భూమికి సంబంధించిన పట్టా కోసం తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ వ్యక్తి ఏకంగా తహసీల్దార్‌నే సహజీవనం చేసిన ఘటన ప్రభుత్వ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. నవంబర్ 4న అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి కార్యాలయంలోనే పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటనలో నిందితుడితో పాటు అటెండర్ సైతం ప్రాణాలు కోల్పోయారు.
తన భూ వివాదానికి సంబంధించి అవతలి వర్గంతో తహసీల్దార్ కుమ్మక్కై తనకు వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు భారీగా లంచం డిమాండ్ చేయడం వల్లనే సురేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వాదనలు వినిపించాయి. ఈ ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందంటూ రోడ్డెక్కారు.
హన్మకొండలో పుట్టినరోజు నాడే అత్యాచారం, హత్యకు గురైన యువతి కథ మరో విషాధగాథ. జన్మదినం సందర్భంగా గుడికి వెళ్లొస్తానంటూ బయటకు వెళ్లిన ఆ అమ్మాయి ఎంతకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు అర్థరాత్రి 11 గంటల సమయంలో యువతి మృతదేహాన్ని కనుగొన్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడింది ఆమె తోటి విద్యార్ధి సాయేనని తేల్చారు. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఆ తర్వాత కొద్దిసేపటికే యువతి మరణించడతో భయపడిన సాయి.. ఆమె బట్టలు తీసేసి, కొత్త దుస్తులు తొడిగి కారులోనే ఊరంతా తిప్పి అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు నిర్థారించారు.
నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లాలోని ఎల్లాపటార్‌లో సమత అనే వివాహిత అత్యాచారం, హత్యకు గురైంది. బాధితురాలిపై షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముఖ్‌దూమ్‌లు అత్యాచారం చేసి అనంతరం గొంతుకోసి హతమార్చారు.
దీనిపై గిరిజన, ప్రజా సంఘాలు భగ్గుమనడంతో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసింది. పోలీసులు మొత్తం 140 పేజీల ఛార్జిషీటును సిద్ధం చేసి, 44 మంది సాక్షులను విచారించి, అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. న్యాయస్థానం తీర్పుపై అన్ని వర్గాల నుంచి ఆసక్తి నెలకొంది.
శంషాబాద్‌లో పశువైద్యురాలు దిశపై జరిగిన హత్యాచారంతో దేశం ఉలిక్కిపడింది. స్కూటీ పంక్చర్ డ్రామా ఆడిన నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు కలిసి ఆమెను తొండుపల్లి జంక్షన్ వద్దవున్న నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారం చేసి, హత మార్చి అనంతరం ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బాధితురాలు స్కూటీని పార్కింగ్ చేసినప్పుడే ఆమెపై అత్యాచారానికి ప్లాన్ చేసిన నలుగురు నిందితులు.. స్కూటీ డ్రామా ఆడి అనంతరం నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లారు. దిశకు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోవడంతో చనిపోయిందని భావించి లారీలో మరో చోటికి తీసుకెళ్లారు. ఆ స్థితిలోనూ ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు.
అనంతరం చటాన్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద వున్న అండర్ పాస్ కింద దిశపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నారాయణ్ పేట్ జిల్లాకు చెందిన మహ్మద్ పాషా, శివ, నవీన్, చెన్నకేశవులను అదుపులోకి తీసుకున్నారు. అయితే డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున సీన్ రీకనస్ట్రక్షన్‌లో భాగంగా చటాన్‌పల్లి అండర్ పాస్ వద్దకు సిట్ బృందం నిందితులను తీసుకుని వచ్చింది.
ఈ సమయంలో పోలీసులపై దాడి చేసి ఆయుధాలను లాక్కొన్న నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం చేసింది. మానవహక్కుల సంఘం ఈ కేసును సుమోటాగా తీసుకుని విచారణ నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టులో సైతం పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలోనే ఉంచారు.