కేసీఆర్ కు ఫిదా: ఉద్వేగం, చమత్కారాలతో నరసింహన్ ప్రసంగం

By telugu teamFirst Published Sep 7, 2019, 5:27 PM IST
Highlights

తనకు తెలంగాణ సిఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ లో ఏర్పాటైన ఆత్మీయ వీడ్కోలు సభలో తెలంగాణ తొలి గవర్నర్ నరసింహన్ భావోద్వేగ ప్రసంగం చేశారు. తనకూ కేసీఆర్ కు మధ్య కుదిరిన అవగాహనపై ఆయన మాట్లాడారు.

హైదరాబాద్: తనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఆత్మీయ వీడ్కోలు సభను ఉద్దేశించి, గవర్నర్ నరసింహన్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. "పెద్దలను గౌరవించడం, కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపడం, నమ్మకం నిలబెట్టుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ లో నాకు కనిపించాయి" అని ఆయన అన్నారు. 

"ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు నమస్కారం చెపితే, పెద్దవాళ్లు చిన్నవాళ్లకు నమస్కారం పెట్టకూడదు అనేవారు. ఆ సంస్కారం నాకు కూడా ఎంతో నేర్పింది. మా అమ్మ చనిపోయినప్పుడు కేసీఆర్ కేవలం 15 నిమిషాల్లో నా దగ్గరకి వచ్చారు. అన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు. అన్నట్లే అన్నీ చూసుకున్నారు" అని అన్నారు. 

"అస్తికలు కలపడానికి హెలిక్యాప్టర్ లో పంపారు. గుడుల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేసి మానవత్వం చూపారు. తెలంగాణ గవర్నర్ గా వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తామని ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే కేసీఆర్ మాటిచ్చారు. అన్న విధంగా మాట నిలబెట్టుకున్నారు. నమ్మకం నిలబెట్టుకున్నారు. మా మధ్య మొదటి నుంచీ ఉన్నది పరస్పర నమ్మకమే" అని గవర్నర్ చెప్పారు.

"కేసీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాల్లో మానవత్వం ఉన్నది. డబుల్ బెడ్ రూము ఇండ్లు, కేసీఆర్ కిట్స్, లాంటి పథకాల్లో మానవత్వం ఉంది. నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ లాంటి పథకాల్లో కేసీఆర్ విజనరీ కనిపించింది. తెలంగాణలో శాంతిభధ్రతల పర్యవేక్షణ చాలా గొప్పగా ఉంది. ప్రతీ స్కీము గురించి నాకు చెప్పేవారు. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వివరించేవారు" అని నరసింహన్ అన్నారు. 

"డబ్బుందా అని అడిగితే, తెలంగాణ రాష్ట్రానికి ఢోకా లేదని, ధనిక రాష్ట్రమని ధైర్యంగా ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు దేశవ్యాప్తంగా చర్చ అయ్యేవి. ముఖ్యమంత్రి స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి, స్క్రీన్ పై పథకాల గురించి వివరించిన వైనాన్ని నేను ప్రధాన మంత్రికి కూడా చెప్పాను" అని అన్నారు. 

"కేసీఆర్ కు ప్రజల నాడి తెలుసు. వారి కష్టాలు తెలుసు. అందుకే మంచి పథకాలు తేగలిగారు. ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నా. ఇద్దరం గంటల తరబడి చర్చలు చేసేవారం. వాడీవేడి చర్చలు జరిగేవి. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కల సాకారమవుతుంది. ఎక్కడున్నా సరే, తెలంగాణ ఫలానా రంగంలో నెంబర్ వన్ గా నిలిచింది, ఫలానా విషయంలో టాప్ గా ఉంది అనే వార్తలు చదివి సంతోషిస్తా. తెలంగాణ మొదటి గవర్నర్ గా నా పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. దీన్నెవరూ మార్చలేరు
" అని గవర్నర్ అన్నారు.

గవర్నర్ తన ప్రసంగంలో సంస్కృత శ్లోకాలు చదివారు. చమత్కారాలతో గవర్నర్ ప్రసంగం సాగింది.
 "చాలా మంది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి మాట్లాడతారు. వారంతా కలవకుంట మాట్లాడతారు. నేను కలిసి మాట్లాడుతున్నాను" అని చమత్కరించారు. 
"నా పేరు నరసింహన్. పేరుకు తగ్గట్టు పనిచేయాలి. లేకుంటే సార్థక నామధేయుడు అనరు. అందుకే అప్పుడప్పుడు నరసింహ అవతారం ఎత్తాల్సి వచ్చింది" అని అందరినీ నవ్వించారు. 

మద్యాహ్నం 12.30 గంటలకు ప్రగతిభవన్ చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి దంపతులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు గవర్నర్ దంపతులను ఘనంగా సన్మానించారు. 

వీడ్కోలు సభ అనంతరం గవర్నర్ దంపతుల గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ విందు ఇచ్చారు. గవర్నర్ గౌరవార్థం పూర్తి శాఖాహార భోజనం, అదీ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా పెడుతున్నామని అంతకుముందు సభలోనే సిఎం ప్రకటించారు. విందు తర్వాత గవర్నర్ దంపతులు రాజ్ భవన్ వెళ్లారు. గవర్నర్ దంపతులను కారుదాకా వెళ్లి ముఖ్యమంత్రి దంపతులు సాగనంపారు. 

ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మండలి వైస్ చైర్మన్ విద్యాసాగర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, మంత్రులు ఈటెల రాజెందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు టంకశాల అశోక్, జి.ఆర్.రెడ్డి, అనురాగ్ శర్మ, ఎకె ఖాన్, అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యులు, ఎంపి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే కెటి రామారావు, మాజీ ఎంపి కె.కవిత, ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు తమ తమ జీవిత భాగస్వాములతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

click me!