ల్యాండ్ క్రూయిజర్ల కొనాలన్నది భద్రతా విభాగం నిర్ణయం - కల్వకుంట్ల కవిత..

By Sairam Indur  |  First Published Dec 30, 2023, 3:36 PM IST

సీఎం, మంత్రుల భద్రతా విషయాన్ని అధికారులే చూసుకుంటారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla kavitha) అన్నారు. ఏ నాయకుడు కూడా తనకు ఇన్ని వాహనాలు కావాలని కోరరని తెలిపారు. తెలంగాణ సీఎం చెబుతున్న 22 ల్యాండ్ క్రూయిజర్లు (22 Land Cruisers) కొనాలనే నిర్ణయం భద్రతా అధికారులు తీసుకున్నదే అని అన్నారు. 
 


గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేసి విజయవాడలో దాచి పెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ల్యాండ్ క్రూయిజర్ల కొనాలన్నది భద్రతా విభాగం నిర్ణయమని అన్నారు. శనివారం ఆమె వరంగల్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ల్యాండ్ క్రూయిజర్లపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. 

సీఎం, మంత్రులు, ఇతర వీఐపీల భద్రతా ఏర్పాట్లను పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు చూసుకుంటాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆ విషయాల్లో రాజకీయ నాయకుల పాత్ర లేదని అన్నారు. ఏ సీఎం ప్రోటోకాల్ అయినా అంతిమంగా భద్రతా విభాగం, ఇంటెలిజెన్స్, పోలీసులే నిర్ణయిస్తారని తెలిపారు. ఏ నాయకుడు కూడా తనకు ఇన్ని వాహనాలు కావాలని కోరుకోరని తెలిపారు. ఇందులో భాగంగానే భద్రతా విభాగం అధికారులే ల్యాండ్ క్రూయిజర్లు కొనాలని నిర్ణయించారని తెలిపారు.

సీఎంకు, మంత్రుల‌కు ఎంత సెక్యూరిటీ అవ‌స‌ర‌మో పోలీసులు నిర్ణ‌యిస్త‌రు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు పోలీసులు చేయిస్త‌రు. వెట‌కారంగా మాట్లాడి, మేమేదో దాచుకున్న‌ట్లు, ఈయ‌నేదో క‌నిపెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడ‌టం త‌న స్థాయిని త‌గ్గించుకోవ‌ట‌మే! pic.twitter.com/bz30UI8UMe

— Kavitha Kalvakuntla (@RaoKavitha)

Latest Videos

వాటిని ఎక్కడ కొనుగోలు చేయాలో, అవసరమైన భద్రతా సౌకర్యాలు ఎవరు చేయాలనే విషయాన్ని కూడా అధికారులే చూసుకుంటారని చెప్పారు. అందుకే అవి విజయవాడలో ఉండి ఉంటాయని అన్నారు. అంతే కానీ తమ ప్రభుత్వమేదో దానిని దాచి పెట్టాలని అనుకోలేదని అన్నారు. కానీ ప్రస్తుత సీఎం తానేదో కనిబెట్టానని అనుకోవడం దురదృష్టకరమని తెలిపారు. 

గత పదేళ్లలో పోలీసులు తమకు ఎలాంటి భద్రత కల్పించాలనే దానిపై నాయకులు ఏనాడూ పట్టుబట్టలేదని కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి చిన్నచూపు చూడటం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా గిరిజన పండుగ అయిన సమ్మక్క సారమ్మ జాతరను దక్షిణ భారత కుంభమేళాగా అభివర్ణించారు. ఈ పండుగకు జాతీయ పండుగ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ అంశంపై గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పలు విజ్ఞప్తులు చేశానని గుర్తు చేశారు. 

click me!