రెండో విడత కంటి వెలుగు.. పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియమానికి రేపు నోటిఫికేషన్..

By Sumanth KanukulaFirst Published Nov 30, 2022, 2:17 PM IST
Highlights

రెండో విడుత కంటి వెలుగు అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 18 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

రెండో విడుత కంటి వెలుగు అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 18 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే కంటి వెలుగు అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,491 వైద్య బృందాలను ఏర్పాటు చేయనున్నారు. పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నియామక బాధ్యతలను కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. ఇంటర్వ్యూ పద్దతిలో పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టనున్నారు. డిసెంబర్ 1 నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. డిసెంబర్ 5వ తేదీ ఇంటర్ల్యూ నిర్వహించి, 10వ తేదీన మెరిట్‌లిస్ట్‌ను విడుదల చేయనున్నారు.  

ఇదిలా ఉంటే.. మరోసారి జనవరి 18 నుంచి కంటి వెలుగు చేపడుతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ తెలిపారు.  కంటివెలుగు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో మంత్రి ఎర్రబెల్లితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసారి కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ పాలనా అనుమతులు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని, అవసరమైన వారికి ఉచితంగా కండ్లద్దాలు అందించాలని చెప్పారు. 100 పనిదినాల్లో లక్ష్యం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, ఎంపీటీసీ, సర్పంచ్, ఇలా ప్రజా ప్రతినిధులంతా కంటి వెలుగు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. 

click me!