వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వాడుతున్న భాషను మార్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత సూచించారు.ఇష్టారీతిలో మాట్లాడడం మానుకోవాలని ఆమె షర్మిలకు సూచించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వాడుతున్న భాష చూసి మహిళలుగా తాము సిగ్గుపడుతున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత చెప్పారు.బుధవారంనాడు టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏ లక్ష్యంతో వైఎస్ షర్మిల మా రాష్ట్రంలో పర్యటిస్తున్నారో చెప్పాలన్నారు. విషనాగులు తెలంగాణలో తిరుగుతున్నారని ఆమె షర్మిలపై మండిపడ్డారు. తన పాదయాత్ర వెనుక ఉన్న లక్ష్యం, ఉద్దేశ్యం ఏమిటని గొంగిడి సునీత ప్రశ్నించారు. షర్మిల నోరు పారేసుకుంటే ఇక్కడ చుస్తూ ఎవరూ కూడా ఊరుకోరని సునీత చెప్పారు. తన పాదయాత్రలో ప్రజల కష్టాలు ఏం చూశారో షర్మిల చెప్పాలని ఆమె కోరారు.వైఎస్ఆర్ కూతురిగా షర్మిలకు ఉన్న గుర్తింపు ఏమిటని ఆమె ప్రశ్నించారు.చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే రకం షర్మిలగా ఆమె విమర్శించారు. తెలంగాణకు ఏం ఒరగబెట్టాలని షర్మిల పర్యటిస్తున్నారో చెప్పాలన్నారు.
ఇష్టారీతిగా మాట్లాడే పద్దతిని మానుకోవాలని ఎమ్మెల్యే సునీత షర్మిలకు సూచించారు.అడ్డగోలుగా మాట్లాడి మహిళల పరువును తీయవద్దని ఆమె షర్మిలకు సూచించారు. రాజకీయాల్లో ఉన్న మహిళలు కూడా షర్మిల భాషను చూసి సిగ్గుపడుతున్నారన్నారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే సునీత మండిపడ్డారు. ఎంగిలి మెతుకులకు ఆశపడి తెలంగాణలో షర్మిల పర్యటిస్తున్నారని ఆమె విమర్శించారు.
తెలంగాణను ఆఫ్ఘనిస్తాన్ గా, కేసీఆర్ ను తాలిబన్ గా షర్మిల చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సునీత తప్పు బట్టారు. ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ పాలనలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులుంటాయా ఎమ్మెల్యే అడిగారు. ఇక నుండి ఇలా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారన్నారు. కానీ తెలంగాణలో అలా చేయలేదన్నారు. ఏపీలో ఓదార్పు చేయాల్సిన అవసరం షర్మిలకు ఉందని ఆమె సలహా ఇచ్చారు.
also read:షర్మిల ఇలా మాట్లాడితే ఏం జరిగినా మేం బాధ్యులం కాదు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్
తమ ఆస్తులను కాపాడుకొనేందుకు గాను వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత విమర్శించారు. మీ కుటుంబం మొత్తం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారన్నారు. షర్మిల తన పద్దతులను, బాషను మార్చుకోవాలని ఆమె సూచించారు.