
న్యూఢిల్లీ: ప్రజా కూటమిలో 35 సీట్లపై భాగస్వామ్య పార్టీల మధ్య పీటముడి పడినట్లు తెలుస్తోంది. ఈ 35 సీట్లను తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, కాంగ్రెసు పార్టీలు మూడూ ఆశిస్తున్నాయి. దీంతో ఆ సీట్లపై పార్టీల మధ్య అవగాహన కుదరడం కష్టంగా మారింది. ఆ 35 సీట్లే పొత్తులో పీటముడికి కారణమని తెలంగాణ పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు కోర్ కమిటీకి చెప్పినట్లు తెలుస్తోంది.
టీడీపి, సిపిఐ, టిజెఎస్ కు ఇచ్చే సీట్లపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా బుధవారం ఢిల్లీలో ఏఐసిసి కోర్ కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్, ఏకె ఆంటోనీ, వాయలార్ రవిలతో చర్చించారు. కూటమిలో పొత్తులపై ఏకాభిప్రాయం కుదరడం లేదంటూ వస్తున్న వార్తలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
తాము 40 నుంచి 45 సీట్లతో తొలి జాబితా విడుదల చేయాలని అనుకుంటున్నట్లు కుంతియా, ఉత్తమ్ కోర్ కమిటీ సభ్యులకు చెప్పారు. అయితే, 35 సీట్ల వ్యవహారమే తేల్చాల్సి ఉందని వారన్నారు. ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న సీట్లను టీడీపి కోరుతోందని, అదే విధంగా ఉద్యమాలు బలంగా సాగిన, ఉద్యోగులు ఎక్కువగా ఉన్న సీట్లను టిజెఎస్ కోరుకుంటోందని, అయితే ఆ సీట్లలోని చాలా వాటిలో కాంగ్రెసు కూడా బలంగా ఉందని వారు కోర్ కమిటీకీ చెప్పినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో డి. శ్రీనివాస్, గడ్డం వినోద్, రాములు నాయక్ కాంగ్రెసు పార్టీలో చేరే విషయంపై కూడా సమావేశంలో చర్చించారని సమాచారం. రాహుల్ గాంధీ పాల్గొనే సభలో వారు పార్టీలో చేరుతారని భావిస్తున్నారు.
టీజేఎస్, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని కుంతియా అన్నారు. ప్రధాన పార్టీలైన టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నాయకులతో చర్చించిన అంశాలను కోర్ కమిటీ దృష్టికి తీసుకుని వెళ్లామని ఆయన మీడియాతో చెప్పారు. నెలాఖరుకల్లా సీట్ల సర్దుబాటు కొలిక్కివస్తుందని చెప్పారు.
రాహుల్ తెలంగాణ పర్యటన ఎన్నికల ప్రచారంలో భాగమేనని, త్వరలో సోనియా కూడా రాష్ట్రానికి వస్తారని చెప్పారు. టికెట్లు లభించని నేతలకు పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా పార్టీ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.