ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ సర్పంచ్ నవ్య : వేధింపుల కేసులో కీలక ట్విస్ట్.. పోలీసులకు ఫిర్యాదు...

By SumaBala Bukka  |  First Published Jun 22, 2023, 9:08 AM IST

సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య మీద పోలీస్ స్టేషన్ లో వేధింపుల కేసు పెట్టింది. ఎమ్మెల్యేతో పాటు భర్త మీద కూడా ఆమె ఫిర్యాదు చేసింది. 


వరంగల్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య మరోసారి గొడవలు తారా స్థాయికి చేరాయి. లైంగిక వేధింపుల ఘటన చినికి, చినికి గాలివానగా మారి పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం జానకిపురం సర్పంచ్ కురుసపల్లి నవ్య, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని గతంలోనే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్వయంగా రాజయ్య వారి ఇంటికి వెళ్లి మాట్లాడి, రాజీకి వచ్చారు. గొడవను సర్దుమణిగేలా చేశారు.

ఈ గొడవ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేతో పాటు,  ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పిఏ శ్రీనివాస్, తన భర్త  ప్రవీణ్ ల మీద సర్పంచ్ నవ్య ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు తన భర్త, ఎంపీపీ ఎమ్మెల్యే పిఏల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నవ్య పోలీసులను డిమాండ్ చేశారు.

Latest Videos

బిడ్డలాంటిదానితో ఐలవ్యూ అంటాడా?... ఎమ్మెల్యే రాజయ్యపై జానకీ పురం సర్పంచి నవ్య వేధింపుల ఆరోపణలు..

వేధింపులపై మూడు నెలల క్రితం తాను ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే రాజయ్య క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే, ఆ సమయంలో గ్రామాభివృద్ధికి రూ. 25 లక్షలు ఇస్తానని చెప్పారని.. కానీ, ఇప్పటి వరకు నయా పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. డబ్బులు ఇవ్వకపోగా ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు నవ్య. ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.

100 రూపాయల బాండ్ పేపర్ మీద రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు సంతకం పెట్టాలని ఎమ్మెల్యే.. ఆయనతో పాటు తన భర్త, ఎమ్మెల్యే పిఏ, ఎంపీపీ వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో  నవ్య పేర్కొంది. భర్తతో కలిసే పోలీస్ స్టేషన్కు వెళ్లిన సర్పంచ్ నవ్య భర్త మీద కూడా ఆరోపణలు చేయడం ఈ కేసులో ట్విస్ట్. 

ఆమె తన ఫిర్యాదులో ఇలా రాశారు… ‘స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య జానకిపురం గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్న నన్ను గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. గతంలో నేను అతని మీద ఆరోపణలు చేయడంతో నా భర్త ద్వారా నన్ను బలవంతంగా రాజీకి ఒప్పించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రాజయ్య మా ఇంటికి స్వయంగా వచ్చి ఇకముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చారు. జానకిపురం గ్రామ అభివృద్ధి కోసం రూ.25 లక్షలు తన సొంత నిధులనుంచి మంజూరు చేస్తానని మీడియా ముఖంగా హామీ ఇచ్చారు.  

సొంత చెల్లిని, బిడ్డను కూడా ముట్టుకోలేని పరిస్థితి కల్పించారు.. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాజయ్య..

ఆయన మాటలు నమ్మి ఆ సమయంలో రాజీపడ్డాం. కానీ  మూడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్క పైసా నిధులు కూడా మంజూరు చేయలేదు. రూ.25 లక్షలు మాకు ఇచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యే. నా భర్త ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే అనుచరుడు శ్రీనివాస్ ఒక నెల రోజుల క్రితం నన్ను హన్మకొండకు రప్పించారు. గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఇస్తామని తెలిపారు.  అక్కడ నా దగ్గరికి రెండు అగ్రిమెంట్ పేపర్లు తీసుకువచ్చారు. 

ఆ పేపర్లలో ఒకదాంట్లో గతంలో నేను ఎమ్మెల్యే మీద చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్ధమని, రాజకీయ లబ్ధి కోసం నేను తప్పుగా ప్రచారం చేసినట్లు ఒప్పుకుంటున్నట్లుగా స్టాంపు పేపర్ మీద రాయించి తీసుకువచ్చారు. మరో స్టాంప్ పేపర్ పై నాకు అప్పుగా రూ.20 లక్షలు ఇచ్చినట్లు.. వారు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను తిరిగి ఇచ్చే విధంగా ఒప్పుకున్నట్లుగా రాసుకొని తీసుకు వచ్చారు. ఆ రెండు స్టాంపు పేపర్ల మీద సంతకం పెట్టాలంటూ నన్ను బలవంతం చేశారు. 

అయితే అవి చదివిన నేను అలా చేయడానికి ఒప్పుకోలేదు. నా భర్తకు డబ్బు ఆశ చూపించి ట్రాప్ చేశారు. నేను సంతకం పెడితేనే గ్రామానికి  మీడియా ముందు ఒప్పుకున్న రూ. 25 లక్షలు మంజూరు చేస్తానని వేధింపులకు గురి చేస్తున్నారు ఎమ్మెల్యే. మార్చి 8న జరిగిన వేధింపుల ఘటనలో ధర్మసాగర్ ఎంపీపీ నిమ్మ కవిత  మధ్యవర్తిత్వం వహించింది. ఆ సమయంలో జరిగిన గొడవ సందర్భంగా క్షమించమని ప్రాధేయపడింది. దీంతో ఆ సమయంలో నేను ఆమె పేరు బయట పెట్టలేదు.  

ఆ విషయాన్ని మర్చిపోయి నా భర్తకు డబ్బు ఆశ చూపించి ఒప్పంద పత్రంపై నాతో బలవంతంగా సంతకం చేయించాలని ప్లాన్ చేశారు.  నిజాయితీగా ఉండాలనుకుంటున్న నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆయన పీఏ ఎంపిపి నా భర్త మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని నాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను’ అని ఆమె ఫిర్యాదులు రాసుకొచ్చారు.

బుధవారం నాడు నవ్య ఇచ్చిన ఫిర్యాదును ధర్మసాగర్ పోలీసులు తీసుకున్నారు. కానీ రాత్రివరకు కూడా దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నవ్య తన ఫిర్యాదులో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే పిఏ, ఎంపీపీ, తన భర్తల మీద కూడా ఆరోపణలు చేసినప్పటికీ.. ఆ ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ కంటెంట్ లేకపోవడం వల్ల కేసు నమోదు చేయలేదన్నారు.  ధర్మసాగర్ సిఐ ఒంటేరు రమేష్ మాట్లాడుతూ  న్యాయపరమైన సలహా తీసుకున్న తర్వాతే చర్యలు చేపడతామని తెలిపారు.

click me!