ఈ సంగారెడ్డి యూత్ ఏం చేసిర్రో తెలుసా ?

First Published Dec 7, 2017, 3:46 PM IST
Highlights
  • సంగారెడ్డిలోనూ బాబు చిత్రపటానికి పాలాభిషేకం
  • తెలంగాణలో 6ఏళ్లుగా టీచర్ పోస్టుల భర్తీ లేదని ఆవేదన
  • సర్కారు ఇప్పటికైనా కండ్లు తెరుచుకోవాలని హితవు

నిన్నమొన్నటి వరకు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ యువత ఇప్పుడు ఒక్కసారిగా టిడిపి అధినేత చంద్రబాబుపై సానుకూల వైఖరి తీసుకున్నది. దానికి కారణం తెలంగాణ యువతకు చంద్రబాబు చేసిందేమీ లేదు. కకపోతే ఎపిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా బాబు సర్కారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణలో చంద్రబాబుపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిరుద్యోగులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు.

తెలంగాణ రాగానే సిఎం కేసిఆర్ తెలంగాణ ప్రజల మీద వరాల జల్లులు కురిపించారు. ఆయన నిర్ణయం తీసుకోవడం... వెంటనే లబ్ధిదారులుగా ఉండేవారంతా పాలాభిషేకాలు చేయడం జరిగిపోయాయి. తెలంగాణ సిఎం కేసిఆర్ చిత్రపటానికి కనీసం 100 సార్లకంటే ఎక్కువగా తెలంగాణలో పాలాభిషేకాలు జరిగాయి. తొలి ఏడాదిలో ఎక్కువ జరిగాయి. తర్వాత రెండో ఏడాదిలో అంతగా కాకపోయినా కొద్దిగా తక్కువ జరిగాయి. మూడో ఏడాదిలో బాగా తగ్గిపోయాయి. అయినా అక్కడో ఇక్కడో జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే తెలంగాణలో ఎపి సిఎం కు పాలాభిషేకం జరగడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉందని జనాలు అంటున్నారు. తెలంగాణ సర్కారుపై తీవ్రమైన వత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే కడుపు మండిన యువత పాలాభిషేకాలు చేస్తున్నారని పాలమూరు టీచర్ అభ్యర్థి ఒకరు ఏషియా నెట్ కు చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పాలమూరులోనే కాకుండా తెలంగాణలోని సంగారెడ్డిలో కూడా యువత టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబుకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ లో గత 6 సం।లు గా డియస్సి కసరత్తు చేస్తున్నారు కాని స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవటం విచారణకరమని సంగారెడ్డి యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రలో లోటు బడ్జెట్‌ తో ఉన్నాకుడా 2 వ సారి డియస్సి వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎపిలో రెండో డిఎస్సీ పూర్తయితే దాదాపు 22 వేల టీచర్ పోస్టులు భర్తీ అవుతాయని అంటున్నారు. అందుకే చంద్రబాబు నాయుడి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని చెప్పారు. అనిల్‌ రెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎండి మహబుబ్‌ అలి, జోగినాథ్‌ రవి కుమార్‌, ఎం.సంగమేష్‌, మహేష్‌, సల్మాన్‌, ఇస్మాయిల్‌, హరినాథ్‌, నవీన్‌, గోపి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

click me!