
శంషాబాద్: శంషాబాద్ రోడ్డు ప్రమాదానికి కారు డ్రైవర్ కారణమని పోలీసులు తేల్చారు. శంషాబాద్ లో కారు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
డ్రైవర్ మద్యం సేవించి నడుపుతూ లారీకి ఎదురుగా కారును తీసుకుని వెళ్లాడని, కారును తప్పించడానికి లారీ డ్రైవర్ ప్రయత్నించాడని, దాంతో లారీ పల్టీ కొట్టి ఆరుగురు మరణించారని పోలీసులు అంటున్నారు. కారు శంషాబాద్ నుంచి షాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. కారులో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మృతులంతా వలస కూలీలని భావిస్తున్నారు. ఆరుగురు మరణించగా 15 మందిదాకా గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
శంషాబాద్ నుంచి కూరగాయలు తీసుకుని వెళ్తున్న క్రమలో ఆ ప్రమందా సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు లారీలో దాదాపు 30 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.