టిఆర్ఎస్ ఎంపి కవిత స్టయిలే వేరబ్బా

First Published May 10, 2018, 6:45 PM IST
Highlights

ఎంపి గారి నయా స్టయిల్

టిఆర్ఎస్ ఎంపి కవిత స్టయిల్ కొత్తగా ఉంటది. ఇవాళ తెలంగాణ అంతటా రైతుబంధు పథకం ప్రారంభమైంది. చిన్నా పెద్ద లీడర్లంతా ఈ కార్యక్రమంలో బిజీ అయ్యారు. కానీ అందరికంటే డిఫరెంట్ గా కవిత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వివరాలు, ఫొటోలు కింద ఉన్నాయి చూడండి. చదవండి.

డప్పు చప్పుళ్లు మంగళహారతులతో పండగకు పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం పలికారు  మహిళలు. పట్టుపట్టి ఎడ్లబండిని ఎక్కించి..కవిత ను ఊరేగించిన తీరు అవధుల్లేని వారి సంతోషాన్ని తెలిపింది. ఈ అపూర్వ సన్నివేశం జగిత్యాల రూరల్ మండలం గుల్ల పేటలో ఆవిష్కృతమైంది. పలుచోట్ల ఎంపి కవిత వాహనాన్ని ఆపి మహిళలు ఆలింగనం చేసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభమయిన రైతు బంధు పథకంను జగిత్యాల నియోజకవర్గంలో కవిత ప్రారంభించారు. గుల్లపేట్ కు వెళ్లిన సందర్భంగా రైతులు ఇలా ఎంపి కల్వకుంట్ల కవిత పట్ల తమ అభిమానాన్ని చాటారు.  తాటి ముంజలు, వెల్లుల్లి తో తయారు చేసిన హారాన్ని గౌడ రైతులు కవిత మెడలో వేశారు. సారంగాపూర్ మండలం లచ్చక్కపేట గ్రామంలో మొక్కజొన్న కంకులతో తయారు చేసిన దండను రైతులు వేశారు. రాయికల్ మండలం ఒడ్డె లింగాపూర్ గ్రామంలో మామిడి కాయలు దండ  వేసి మామిడి రైతులు తమ అభిమానం చాటుకున్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, పెట్టుబడి సాయంగా ఎకరాకు 4వేలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపి కవిత మాట్లాడుతూ వ్యవసాయం దండగ అన్న వారికి వ్యవసాయం పండుగ అనే తెలియచెప్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయము పైనే దృష్టి పెట్టారని చెప్పారు. బషీర్ బాగ్, ఖమ్మం జిల్లా ముదిగొండ లో రైతులపై కాల్పులు జరిపించిన ప్రభుత్వాలను రైతులు చూశారు.. రెవిన్యూ అధికారులు స్వయంగా మీ ఇంటికి వచ్చి చెక్కులు ఇస్తున్నారు..సీఎం కేసీఆర్ కు రైతుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అన్నారు ఎంపి కవిత.

 స్వయంగా రైతు అయిన కేసీఆర్ రైతులకు అవసరం అయిన అంశాలను పరిష్కరిస్తూ వస్తున్నారన్నారు. వ్యవసాయం కు అవసరమైన కరెంటు, సాగు నీరు, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సౌకర్యాలు మెరుగు పరిచారు.. పెట్టుబడికి అప్పులు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి సాయం చేస్తున్నదని కవిత వివరించారు. ఎప్పుడు స్విచ్ వేసినా వెలిగే బల్బు టిఆర్ఎస్ ప్రభుత్వ పని తనానికి నిదర్శనం అన్నారు. బొంబాయి, దుబాయికి వెల్లినోళ్లంతా సొంతూళ్లకు తిరిగివచ్చేలా ఊర్లు కళకళ లాడాలి..ఊళ్ళు పచ్చబడాలి.. రైతుల మొహంలో ఆనందం కనబడాలి..అని సారంగాపూర్ మండలం నగునూరు, లచ్చక్క పేటలో జరిగిన సభలో కవిత ఆకాంక్షించారు.

రైతులను సంఘటితం చేసేందుకు ప్రభుత్వమే రైతు సంఘాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఎక్కడా లేదు..సీఎం కేసీఆర్ ఈ పని చేసి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర లభించేలా చేసే బాధ్యతను సంఘాలకు అప్పగించారు అని ఎంపి కవిత తెలిపారు. బీర్పూర్ మండలం మంగేలా గ్రామంలో చెక్కులను పంపిణీ చేశారు.  చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

click me!