నిజమా?: మల్కాజిగిరి నుంచి లగడపాటి లడాయి

By pratap reddyFirst Published Nov 3, 2018, 8:10 AM IST
Highlights

అవసరమైతే తాను తెలంగాణలో పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించడం ద్వారా లగడపాటి ఊహాగానాలకు ఊపిరి పోశారు. నిజంగానే ఆయన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ టీవీ చానెళ్లు కోడై కూస్తున్నాయి.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిని మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఒక్క మాటతో ఆయనపై మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. న్యూస్ చానెళ్లు, సోషల్ మీడియాల్లో ఆయన పోటీపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అవసరమైతే తాను తెలంగాణలో పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించడం ద్వారా లగడపాటి ఊహాగానాలకు ఊపిరి పోశారు. నిజంగానే ఆయన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ టీవీ చానెళ్లు కోడై కూస్తున్నాయి. ఆయన పోటీ చేస్తే ఏ సీటు నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని కూడా వండి వారుస్తున్నాయి.

లగడపాటి రాజగోపాల్ మల్కాజిగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. మల్కాజిగిరిలో ఆంధ్ర ఓటర్లు కీలకంగా వ్యవహరిస్తారు. ఆంధ్ర ఓటర్లు అధికంగా ఉండడంతో ఆయన ఆ సీటు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసు పార్టీకి దూరమైన ఆయన ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. దాదాపుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయంపై మీడియా స్పష్టత ఇవ్వడం లేదు. ఏమైనా, ఒక్క మాటతో లగడపాటి రాజగోపాల్ మరోసారి వార్తల్లో ప్రధాన వ్యక్తిగా మారిపోయారు. 

సంబంధిత వార్త

తెలంగాణలో పోటీకి లగడపాటి సై, పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలు

click me!