కేసిఆర్ సర్కారుకు ఆర్టీసి వర్కర్స్ షాక్

First Published May 7, 2018, 5:01 PM IST
Highlights

సొంత యూనియన్ టిఎంయు నేతలు ఎదురుతిరిగినట్లేనా ?

తెలంగాణలో ఆర్టీసి కార్మికులు కేసిఆర్ సర్కారుపై కన్నెర్రజేశారు. తెలంగాణలో గుర్తింపు పొందిన ఆర్టీసి కార్మిక సంఘం టిఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి సర్కారుకు గట్టి హెచ్చరికలు పంపారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన టిఎంయు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇప్పటి వరకు కార్మికులు శాంతియుతంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రులు గా ఉన్నారంటే అది తెలంగాణ ఆర్టీసి కార్మికుల చలువే అని పేర్కొన్నారు.


సర్కారు దయా దాక్షిణ్యాల మీద ఆర్టీసీ కార్మికులు లేరని చెప్పారు. మీ అవసరం మాకెంత ఉందొ.. మా అవసరం మీకు అంతే ఉంటుందని గుర్తించుకోవాలన్నారు. చీటికీ మాటికి కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. డిపో నష్టాల్లో ఉంటే మేనేజర్లకు మెమోలు ఇవ్వాలి.. జోన్ నష్టాల్లో ఉంటే ఇడి, ఎండిలకు మెమోలు ఇవ్వాలి... యాజమాన్యం దీనికి సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. అలాంటప్పుడే తమకు కూడా మెమోలు ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాము కోరితే బోర్డు లేదంటున్నారని విమర్శించారు. మరి ఈడీ ప్రమోషన్, బోర్డు చైర్మన్ పోస్టును ఎలా నింపారని ప్రశ్నించారు. తమకు డైరెక్టర్ పోస్టులు కూడా అవసరం లేదని చెప్పారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ప్రయివేటు ట్రావెల్స్ ఆగడాలు పెరిగిపోయినా వాటిని నియంత్రించే నాధుడే లేడని విమర్శించారు.

ఉద్యమకారుడు సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఉద్యమకారుల మీటింగ్ కు ఎందుకు అనుమతి దొరకడం లేదని ప్రశ్నించారు. కార్మిక, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదో చెప్పాలన్నారు. ప్రయివేటు ట్రావెల్స్ ను అరికడితే ఆర్టీసీకి సంవత్సరానికి వెయ్యి కోట్ల ఆదాయం పెరుగుతుందని సూచించారు. జిహెచ్ఎంసీ నుంచి ఆర్టీసికి రావాల్సిన నిధులు ఎందుకు విడుదల చేయడంలేదని ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఈ ధర్నా హెచ్చరిక మాత్రమే అంటూనే ప్రగతి భవన్ ముట్టడి వరకు రావొద్దని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ నెల 21 తరువాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. సమావేశంలో యూనియన్ నేత థామస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

click me!