దశాబ్ధాలు పోరాడి.. ఇలాంటి సీఎంను తెచ్చుకున్నాం: కేసీఆర్‌పై భట్టి ఫైర్

By sivanagaprasad KodatiFirst Published Oct 25, 2019, 5:03 PM IST
Highlights

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన సంయమనం, సమస్యల పరిష్కారంలో చూపించాల్సిన చొరవ కానీ సీఎం ప్రెస్‌మీట్‌లో కనిపించలేదన్నారు. అడుగడుగునా అహంభావం, ఫ్యూడల్ మనస్తత్వం, రాష్ట్ర ప్రజానీకాన్ని అణగదొక్కి గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనా విధానమే కనిపించింది తప్పించి ఎక్కడా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే తీరు కనిపించలేదని భట్టి ధ్వజమెత్తారు

అధికారం, ధన ప్రవాహం ఇతరత్రా మార్గాల ద్వారా హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలిచిందన్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హుజూర్‌నగర్‌లో గెలిచిన వెంటకే ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన ఎద్దేవా చేశారు.

సీఎం అహంభావం ప్రతి పదంలో కొట్టొచ్చినట్లు కనిపించిందని విక్రమార్క దుయ్యబట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాల్సిన సంయమనం, సమస్యల పరిష్కారంలో చూపించాల్సిన చొరవ కానీ సీఎం ప్రెస్‌మీట్‌లో కనిపించలేదన్నారు.

అడుగడుగునా అహంభావం, ఫ్యూడల్ మనస్తత్వం, రాష్ట్ర ప్రజానీకాన్ని అణగదొక్కి గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనా విధానమే కనిపించింది తప్పించి ఎక్కడా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే తీరు కనిపించలేదని భట్టి ధ్వజమెత్తారు.

Also Read:RTC Strike: సైదిరెడ్డి గెలుపు లోగుట్టు కేసీఆర్ కెరుక...

ఈ రాష్ట్ర ప్రజలు విషజ్వరాలతో చనిపోతూ ఉంటే.. చివరికి జిల్లా జడ్జిలు సైతం మరణిస్తూ ఉన్నారని.. న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసినా కేసీఆర్‌లో చలనం లేదని విక్రమార్క విమర్శించారు.

ప్రతిపక్షాలు సైతం రాష్ట్రవ్యాప్తంగా తిరిగి వాస్తవాలను ప్రచారం చేస్తే.. సారు ఒక్కసారి కూడా బయటకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేయలేదని ఎద్దేవా చేశారు. కానీ హుజూర్‌నగర్‌లో గెలిచిన వెంటనే మితిమీరిన అహంభావంతో మాట్లాడటం బాధాకరమైన విషయమన్నారు.

ఆర్టీసీని, ఆర్టీసీ సంస్థలను లేకుండా చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. అందుకు తగ్గట్టుగానే అసలు ఆర్టీసీ మిగలదనడం వెనుక వాస్తవమేంటని విక్రమార్క ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బట్టి ఆయన నిజస్వరూపం బయటపడిందని.. ఇంతకాలం చంద్రశేఖర్ రావు ముఖానికి వేసుకునన ముసుగు తొలగిపోయిందని భట్టి పేర్కొన్నారు.

Also Reda:ఆ చట్టం ఏమిటో తెలుసుకో: కేసీఆర్ వ్యాఖ్యలపై ఆశ్వత్థామరెడ్డి

50 వేల మంది కార్మికులు జీతాలు కూడా తీసుకోకుండా సమ్మెకె వెళ్లడం పనికిమాలిన చర్యని సీఎం వ్యాఖ్యానించడం సరికాదని విక్రమార్క హితవుపలికారు. కడుపుకాలిన కార్మికుడు తమకు న్యాయబద్ధంగా కల్పించాల్సిన హక్కులు కల్పించాలని సమ్మె నోటీసు ఇస్తే ముఖ్యమంత్రికి పనికిమాలిన విషయంగా కనిపిస్తుందాంటూ దుయ్యబట్టారు.

సామాన్యుల బాధలు, కార్మికుల బాధలు పనికిమాలిన విషయంగా కనిపిస్తున్నాయంటే కేసీఆర్ మనస్తత్వం అణగదొక్కేటువంటి మనస్తత్వమని స్పష్టంగా తెలుస్తుందని ఆరోపించారు. చంద్రశేఖర్ రావు అణగారిన వర్గాలపై పెత్తనం చలాయిస్తూ.. ఫ్యూడల్‌ వాతావరణంలో పెరిగిన నాయకుడని భట్టి మండిపడ్డారు.

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కేసీఆర్ బాగా చదువుకోవాలని విక్రమార్క చురకలంటించారు. కార్మికుల డిమాండ్లు ఆర్ధిక భారంతో కూడుకున్నవి కాదని న్యాయస్థానం సైతం స్పష్టం చేసిందన్నారు.

Also Read:హుజూర్‌నగర్‌లో ఓటమి ఎఫెక్ట్: ఉత్తమ్‌ను పీసీసీ చీఫ్ నుండి తప్పిస్తారా?

అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని భట్టి గుర్తుచేశారు.ఎన్నో దశాబ్ధాల పోరాటంతో కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రిని తెచ్చుకున్నామని విక్రమార్క తెలిపారు. దేశ సంపదలో 73 శాతం ఒక్కశాతం మంది ప్రజలు అనుభవిస్తున్నారని . ఒక్క శాతం సంపదని 50 శాతం మంది ప్రజలు పంచుకుంటున్నారని విక్రమార్క వెల్లడించారు.

దీనిని బట్టి దేశంలో ఆర్ధిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీని కేసీఆర్ ఏర్పాటు చేయలేదని.. దశాబ్ధాలుగా ఎన్నో ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆస్తిఅని... దానిని సీఎం అమ్మకానికి పెట్టారని భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాన్ని రూ.3 లక్షల కోట్లకు తాకట్టు పెట్టారని.. భవిష్యత్‌లో ఇంకెన్ని కోట్లు రుణం తీసుకొస్తారంటూ ప్రశ్నించారు. 

click me!