సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయ్యారని ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో మనోవేదనకు గురైన నల్గొండ డిపోలో ఏడీసీగా పనిచేస్తున్న గోసుకొండ మల్లయ్య గుండెపోటుతో శనివారం రాత్రి మృతి చెందాడు.
హైదరాబాద్: ఉద్యోగం పోయిందనే మనోవేదనతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గోసుకొండ మల్లయ్య అనే వ్యక్తి శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన ఆర్టీసీ కార్మకుల్లో విషాదాన్ని నింపింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ ప్రకటనతో మృతి చెందిన కార్మికుల సంఖ్య మూడుకు చేరుకొంది.
ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన గోసుకొండ మల్లయ్య నల్గొండ ఆర్టీసీ డిపోలో ఏడీసీగా పనిచేస్తున్నాడు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయినట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటన తర్వాత గోసుకొండ మల్లయ్య తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.
కొన్ని రోజులుగా ఆయన మనోవేదనతో ఎవరితో కూడ సరిగా మాట్లాడడం లేదని కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. శనివారం నాడు గోసుకొండ మల్లయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హుటాహుటిన హైద్రాబాద్ కు తరలించారు. హైద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లయ్య శనివారం రాత్రి మృతి చెందాడు.మల్లయ్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ సహా మరో 26 డిమాండ్లతో ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాల జేఎసీ, రెవిన్యూ ఉద్యోగుల సంఘాలు మద్దతును ప్రకటించాయి. ఈ నెల 19న తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కూడ విజయవంతమైంది.
ఈ నెల 23వ తేదీన ఓయూలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆర్టీసీ జేఎసీ నిర్ణయం తీసుకొంది. ఈ నెల 19వ తేదీన ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.అయితే ఈ ఆదేశాలకు సంబంధించిన కాపీ అందలేదని ప్రభుత్వం ార్టీసీ కార్మికులతో చర్చించలేదు.
హాట్ టాపిక్ ఆర్టీసీ సమ్మె: మెట్టు దిగని కేసీఆర్, పట్టువీడని కార్మికులు
ఆర్టీసీ కార్మికులు చర్చల విషయంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించనుందోననే విషయమై ఆసక్తిగా చూస్తున్నారు. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు.ఈ విషయమై టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె. కేశవరావును మధ్యవర్తిత్వం వహించాలని కూడ కోరారు. కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాలేదు.
ఆర్టీసీ కార్మికులతో చర్చల విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ ప్రభుత్వానికి ఈ నెల 21న అందే అవకాశం ఉందని సమాచారం.ఈ కాపీ అందిన తర్వాత ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం చర్చల విషయంలో నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టులో విచారణ ఈ నెల 28 సాగనుంది.అయితే ఈ విచారణ లోపుగా చర్చల విషయమై పురోగతిని హైకోర్టుకు ప్రభుత్వం వివరించాల్సి ఉంటుంది.వచ్చే వాయిదా జరిగే నాటికి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందోననేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.