బస్సులో సీటు ఇవ్వలేదని కోర్టులో వృద్ధుడి పోరాటం

First Published Mar 16, 2017, 10:10 AM IST
Highlights
  • తెలంగాణ ఆర్టీసీకి రూ.10 వేలు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం

స్త్రీలను, వృద్ధులను గౌరవించండి. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి అంటూ ప్రతీ ఆర్టీసీ బస్సుల్లో బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. ప్రయాణికులు మాత్రం ఏ రోజు వాటిని పట్టించుకోరు. దర్జాగా తమకు నచ్చిన సీట్లలో కూర్చొంటారు. ఇక పల్లె వెలుగులాంటి బస్సులలో మరీ దారుణం. మహిళల సీట్లలో కూర్చొనే వారినే నిలబడమని గదమాయిస్తారు.

 

ఎవరైనా కండక్టర్  దృష్టికి  తీసుకొచ్చినా వారు లైట్ గానే తీసుకుంటారు. అయితే అందరూ ప్రయాణికులు ఒకలా ఉండరు కదా..

 

ఆర్టీసీ బస్సులో తనకు సీటు ఇవ్వలేదని ఓ వృద్ధుడు ఏకంగా టీఎస్ ఆర్టీసీపై పోరాటానికే దిగాడు. వారిని వినియోగదారుల ఫోరానికి ఈడ్చీ రూ. 10 వేలు జరిమానా కట్టేలా చేశాడు.

 

సంగారెడ్డికి చెందిన సీహెచ్ నాగేందర్ వయస్సు 64 ఏళ్లు. ఆయన 2015 సెప్టెంబర్ 23న సంగారెడ్డి వెళ్లడానికి పఠాన్ చెరువు వద్ద బస్సు ఎక్కి రూ. 20 తో టికెట్ తీసుకున్నాడు.

 

అయితే బస్ లో రష్ ఎక్కువగా ఉండటంతో ఆయనకు సీటు దొరకలేదు. వృద్దుల సీట్లలోనూ ఆయనకు కూర్చొనేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని కండక్టర్ దృష్టికి తీసుకొస్తే అతను పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని నాగేందర్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.

 

వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారికే చోటివ్వాలనే 2013లో ఆర్టీసీ జారీ చేసిన సర్య్కలర్ గురించి ప్రస్తావించారు. దీంతో పరిస్థితి మారుతుందని ఆయన ఆశించారు. కానీ, అదేమీ జరగలేదు.

 

2015లో మళ్లీ ఒకసారి నాగేందర్ సంగారెడ్డికి వెళ్లేందుకు పటాన్ చెరువులో బస్సు ఎక్కాడు. ఈసారి కూడా ఆయనకు సీటు దొరకలేదు. వృద్ధుల సీట్లలోనూ ఆయనకు చోటు ఇవ్వలేదు. కండక్టర్ కు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఈ విషయంపై వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు.

 

కిడ్నీ సమస్యలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న 64 ఏళ్ల వయసులో ఉన్న తనకు ఆర్టీసీ సీటు నిరాకరించిందని తనకు న్యాయం చేయాలని పిటిషన్ లో కోరాడు. దీన్ని విచారణకు స్వీకరించిన ఫోరం ఆర్టీసీ వివరణ కోరగా, వారు ఓ వింత వాదన చేశారు.

 

తాము కేవలం మానవతా దృక్పథంతోనే వృద్ధులకు, మహిళలకు బస్సులో సీట్లు రిజర్వ్ చేశామని, అది కచ్చితంగా అమలు చేయాలనే నిబంధన ఏమీ కాదని వాదించారు.

 

అయితే ఆర్టీసీ యాజమాన్యం వాదనతో ఏకీభవించని ఫోరం బాధితుడికి రూ. 10 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా బాధితుడి కేసును ఆయన వ్యక్తగతంగా కాకుండా అందరి దృష్ట్యా వేసిన కేసుగా తాము భావవిస్తున్నామని ఈ విషయంలో ఆర్టీసీ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది.

click me!