Breaking: కొత్త పార్టీపై సంచలన ప్రకటన చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

By team teluguFirst Published Jul 22, 2021, 8:37 PM IST
Highlights

తెలంగాణాలో బహుజనులే కేంద్రంగా కొత్త పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు ప్రవీణ్ కుమార్.

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినప్పటినుండి మొదలు... ఆయన పొలిటికల్ ఎంట్రీ పై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేసీఆర్ ఆదేశాలతోనే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసాడని కొందరంటే... లేదు బీఎస్పీ పార్టీలో చేరతారని మరికొందరన్నారు. మరికొందరేమో ఆయన నూతన రాజకీయ పార్టీని పెట్టబోతున్నారని అన్నారు. 

మొత్తంగా ఆయన తన రాజకీయ ప్రస్థానం పై ఒకింత క్లారిటీ అయితే ఇచ్చినట్టుగానే కనబడుతుంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో బహుజనులే కేంద్ర బిందువుగా ఒక నూతన రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదని, బహుజనులకు న్యాయం చేసేందుకే తాను బయటకు వచ్చానని ప్రవీణ్ కుమార్ అన్నారు. తన పొలిటికల్ ఎంట్రీ గురించి మరింత క్లారిటీ ఇస్తూ... తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమే అని... కానీ అదెప్పుడు జరుగుతుందో మాత్రం ఇప్పుడే చెప్పలేనని అన్నారు. 

కేవలం 1 శాతం మంది దగ్గరే సంపద నిక్షిప్తమై ఉందని, ప్రభుత్వ పథకాల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన 99 శాతం మంది బహుజనుల కోసమే తాను ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రాదల్చుకున్నట్టు చెప్పారు. 

తనకింకొక ఆరేండ్ల సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ... దాన్ని వదులుకొని తాను రాజీనామా చేసానని... ఈ సమయాన్ని వృధా చేయదల్చుకోవడం లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడెకరాలు, పేదలకు ఇండ్లు, ఇవి కాదు చేయాల్సిందని... వారిని జీవితంలో ఉన్నత స్థితికి తీసుకురావడమే తన ముందున్న తదుపరి లక్ష్యమని ఆయన అన్నారు. 

ఇప్పటివరకు ఒక అధికారిగా తనకున్న పరిమితులకు లోబడి మాత్రమే పనిచేశానని... ఇక ఇప్పుడు బహుజనుల అభ్యున్నతి కోసం ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. సాంఘీక సంక్షేమ గురుకులాల్లో అన్యాయానికి, అక్రమాలకు తావు లేదని... ఒకవేళ తానెక్కడైనా అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే ఉరికంబం ఎక్కేందుకు కూడా తాను సిద్ధమే అని తెలిపారు ప్రవీణ్ కుమార్. 

తనకు ఏవేవో పొలిటికల్ పార్టీల నుండి పిలుపులు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయని, తనకు ఏ రాజకీయ పార్టీ నుండి కూడా పిలుపు రాలేదని ఆయన అన్నారు. కేసీఆర్ పైలట్ ప్రాజెక్ట్ గా లాంచ్ చేయబోతున్న దళిత బంధు చర్చలో పాల్గొనడానికి తనకు పిలుపు రాలేదని, దాని గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని ప్రవీణ్ కుమార్ అన్నారు. 

click me!